ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగిని 20 సార్లు పొడిచి పారేసింది! అస‌లు కార‌ణం ఏమిటంటే..!

న్యూఢిల్లీ: తాను ఆన్‌లైన్ ద్వారా ఆర్డ‌ర్ చేసిన మొబైల్ ఫోన్‌ను ఆల‌స్యంగా డోర్ డెలివ‌రి ఇచ్చాడ‌ని ఓ మ‌హిళ కిరాత‌కురాలిగా మారింది. డోర్ డెలివ‌రి ఉద్యోగిని 20 సార్లు క‌త్తితో పొడిచింది. త‌న సోద‌రుడితో క‌లిసి షూ లేస్‌తో అత‌నికి ఉరి వేసి, హ‌త్య చేయ‌డానికీ ప్ర‌య‌త్నించింది. అత‌ని వ‌ద్ద ఉన్న 40 వేల రూపాయ‌ల‌ను దోచుకుంది కూడా.

ఈ దారుణ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలోని నిహాల్ విహార్‌లో చోటు చేసుకుంది. బాధితుడి పేరు కేశ‌వ్‌. ఆన్‌లైన్ షాపింగ్ పోర్ట‌ల్ ఫ్లిప్‌కార్ట్‌లో డోర్ డెలివ‌రి బోయ్‌గా ప‌నిచేస్తున్నాడు. క‌మ‌ల్ దీప్ అనే మ‌హిళ త‌న సోద‌రుడు జితేంద‌ర్ సింగ్‌తో క‌లిసి నిహాల్ విహార్ ప్రాంతంలో నివ‌సిస్తోంది. కొద్దిరోజుల కింద‌ట ఆమె ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఓ మొబైల్‌ఫోన్‌ను ఆర్డ‌ర్ చేసింది.

దాని రేటు 11 వేల రూపాయ‌లు. ఆర్డ‌ర్ ఇచ్చిన మ‌రుస‌టి రోజు నుంచే ఆమె ఫోన్ చేయ‌డం మొదలు పెట్టింద‌ట‌. నాలుగు రోజుల త‌రువాత కేశ‌వ్ అనే ఉద్యోగి.. దాన్ని డోర్ డెలివ‌రి ఇవ్వ‌డానికి నిహాల్ విహార్‌లోని క‌మ‌ల్‌దీప్ ఇంటికి వెళ్లాడు. డోర్ తీసిన మ‌రుక్ష‌ణ‌మే కేశ‌వ్‌ను బ‌ల‌వంతంగా ఇంట్లోకి లాక్కెళ్లిందామె. దీనికి జితేంద‌ర్ సింగ్ స‌హ‌క‌రించాడు.

ఇద్ద‌రూ క‌లిసి తీవ్రంగా కొట్టారు. కూర‌గాయ‌లు త‌రిగే క‌త్తితో 20 సార్లు కేశ‌వ్‌ను పొడిచారు. షూలేస్‌తో గొంతు నులిమి చంప‌డానికీ ప్ర‌య‌త్నించారు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన కేశ‌వ్.. వారి ఇంట్లోనే స్పృహ‌త‌ప్పాడు. దీనితో అత‌ణ్ణి బైక్‌పై తీసుకెళ్లి చంద‌న్ విహార్ ప్రాంతంలోని మురుగునీటి కాల్వ వ‌ద్ద ప‌డేశారు.

అత‌ని వ‌ద్ద ఉన్న 40 వేల రూపాయ‌లు, ఇత‌ర డోర్ డెలివ‌రి సామాగ్రిని దోచుకున్నారు. డ్రైనేజీ పైప్‌లైన్ ప‌క్క‌న ర‌క్త‌పుమ‌డుగులో ప‌డిఉన్న కేశ‌వ్‌ను చూసిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు కేశ‌వ్‌ను సంజ‌య్‌గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం.. అత‌ణ్ని అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. కేశ‌వ్ ఫిర్యాదు మేర‌కు పోలీసులు క‌మ‌ల్‌దీప్‌, జితేంద‌ర్ సింగ్‌ల‌పై కేసు న‌మోదు చేశారు. వారిని అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here