బీజేపీకి ఓటెయొద్దంటూ కాంగ్రెస్‌కు అనుకూలంగా కేఈ ప్ర‌చారం..!

బెంగ‌ళూరు: తెలుగుదేశం పార్టీ నాయ‌కులు బెంగ‌ళూరుకు వ‌రస క‌ట్టిన‌ట్టే క‌నిపిస్తోంది. క‌ర్ణాట‌క‌లో వ‌చ్చేనెల 12వ తేదీన అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నందున‌.. మ‌న రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం సాగిస్తున్నారు. ప్ర‌చార వ్య‌వ‌హారాల్లో ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి బోణి కొట్టేశారు కూడా.

సోమ‌వారం బెంగ‌ళూరులో ఆయ‌న ప‌ర్య‌టించారు. తెలుగువాళ్లు పెద్ద సంఖ్య‌లో స్థిర‌ప‌డిన కేఆర్ పుర అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న బీజేపీకి వ్య‌తిరేక ప్ర‌చారాన్ని ప్రారంభించారు. వ్య‌క్తిగ‌త ప‌నుల కోసం బెంగ‌ళూరుకు వ‌చ్చాన‌ని అంటూనే.. ఈ ఉద‌యం కేఆర్ పురంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు.

ఏపీని మోడీ దారుణంగా మోసం చేశార‌ని ఆరోపించారు. మోడీ మాయ‌లో ప‌డొద్ద‌ని, బీజేపీకి ఓటు వేయొద్ద‌ని కోరారు. అమ‌రావ‌తి నిర్మాణానికి నిధుల‌ను కేటాయిస్తామ‌ని హామీ ఇచ్చి, చివ‌రికి మొండిచెయ్యి చూపార‌ని విమ‌ర్శించారు.

కాంగ్రెస్‌కు ఓటేస్తారా? జేడీఎస్‌కు ఓటేస్తారా? అనేది ప్ర‌జ‌ల నిర్ణ‌య‌మ‌ని, బీజేపీని ఓడించాలంటూ కేఈ కృష్ణ‌మూర్తి చెప్పారు. విశాఖ‌కు రైల్వే జోన్ ఇస్తామ‌ని, క‌డ‌ప‌లో ఉక్కు ఫ్యాక్ట‌రీని నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చిన కేంద్రంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం చివ‌రికి.. ఏమీ ఇవ్వ‌లేద‌ని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here