అంతిమ‌యాత్ర‌ను అడ్డుకున్న గ్రామ‌స్తులు..పాడె మోసి, ద‌గ్గ‌రుండి అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించిన పోలీసులు!

భోపాల్‌: వ‌యో వృద్ధుడు మ‌ర‌ణిస్తే.. త‌మ స్మ‌శానంలో అంతిమ సంస్కారాల‌ను చేయొద్దంటూ అడ్డుకున్నారు గ్రామ‌స్తులు. ఈ వివాదం చిలికి చిలికి గాలీవానగా మారింది. పోలీసుల దాకా వెళ్లింది. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు ఆ గ్రామ‌స్తుల‌ను న‌చ్చ‌జెప్ప‌డానికి ప్ర‌య‌త్నించారు. వినిపించుకోలేదు.

తాము ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. ఇక లాభం లేద‌నుకున్న పోలీసులు.. తామే ముందుండి అంతిమ‌యాత్ర‌ను నిర్వ‌హించారు. పాడె మోశారు. స్మ‌శానం వ‌ర‌కూ త‌మ భుజాల మీద ఆ వృద్ధుడి పాడెను తీసుకెళ్లారు.

ద‌గ్గ‌రుండి అంతిమ సంస్కారాల‌ను నిర్వ‌హించారు. పోలీసులే ముందుండ‌టంతో ఇక చేసేదేమీ లేక ఆ గ్రామ‌స్తులు చ‌డీ చ‌ప్పుడు చేయ‌లేదు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని దేవాస్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వృద్ధుడి పేరు మ‌ర్దోనియా కంజ‌ర్‌.

88 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో ఆయ‌న మ‌ర‌ణించారు. అంతిమ సంస్కారాన్ని చేయ‌డానికి కుటుంబీకులు సిద్ధ‌ప‌డ‌గా.. త‌మ స్మ‌శానంలో వ‌ద్దంటూ అడ్డుప‌డ్డారు గ్రామ‌స్తులు. దీనికి కార‌ణం.. ఆయ‌న నిమ్న జాతికి చెందిన వాడేన‌ని చెబుతున్నారు.

ఈ సంద‌ర్భంగా ఘ‌ర్ష‌ణ త‌లెత్త‌డంతో పోలీసులు జోక్యం చేసుకుని, అంతిమ‌యాత్ర‌ను నిర్వ‌హించాల్సి వ‌చ్చింది. పోలీసుల మాన‌వ‌త్వానికి అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here