అందం అంటే ఐశ్వ‌ర్యా రాయ్‌దే..డ‌యానా హెడెన్‌ది భార‌తీయ సౌంద‌ర్యం కాదు!

అగ‌ర్త‌లా: మ‌హాభార‌త కాలంలో ఇంట‌ర్‌నెట్‌, ఉప‌గ్ర‌హాలు ఉండేవంటూ స్టేట్‌మెంట్ ఒక‌టి ఇచ్చి దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం పొందిన త్రిపుర ముఖ్య‌మంత్రి విప్ల‌వ్‌కుమార్ దేవ్‌.. మ‌రోసారి వార్త‌ల్లో వ్య‌క్తి అయ్యారు. ఈ సారి ఆయ‌న ఐశ్వ‌ర్యారాయ్‌, డ‌యానా హెడెన్‌ల‌పై కామెంట్స్ చేశారు. భార‌త‌య అందం అంటే ఐశ్వ‌ర్యా రాయ్‌దేన‌ని, డ‌యానా హెడెన్ కానే కాద‌ని అన్నారు.

ఆ త‌రువాత నాలిక్క‌ర‌చుకుని.. దాన్నొక జోక్‌గా తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. భార‌త్ త‌ర‌ఫున ప్రాతినిథ్యాన్ని వహిస్తూ 1997లో మిస్ వ‌ర‌ల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు డ‌యానా హెడెన్‌. దీన్నే విప్ల‌వ్‌కుమార్ దేవ్ తాజాగా త‌ప్పుప‌డుతున్నారు. ఆమె భార‌తీయురాలు కాద‌ని ప‌రోక్షంగా చెప్పుకొచ్చారు.

అస‌లు సిస‌లు భార‌తీయ అందం అంటే ఐశ్వ‌ర్యా రాయ్‌దేన‌ని, డ‌యానా హెడెన్ మిస్ వ‌ర‌ల్డ్ టైటిల్‌ను సాధించిన‌ప్ప‌టికీ.. ఆమెది మ‌న‌దేశ సౌంద‌ర్యం కాద‌ని చెప్పారు. త్రిపుర రాజ‌ధాని అగ‌ర్త‌లాలో గురువారం ఏర్పాటైన ఓ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి మాట్లాడారు.

`డ‌యానా హెడెన్ కూడా మిస్ వ‌ర‌ల్డ్ టైటిల్ గెలిచారంటే అంద‌రూ న‌వ్వుతున్నారు. డ‌యానా దానికి అర్హురాలేనా? ఐశ్వ‌ర్య రాయ్ ఆ టైటిల్ గెలిచారంటే దానికి ఓ అర్థం ఉంది. ఎందుకంటే- ఆమె అందంలో భార‌తీయ‌త ఉంది. ఆమె భార‌తీయ మ‌హిళ. దేవ‌త‌లు ల‌క్ష్మీ, స‌ర‌స్వ‌తి..ల‌ది భార‌తీయ అందం. అలాంటి అందం డ‌యానా హెడెన్‌కు లేదు. ఆమె స‌రి తూగ‌దు..` అని చెప్పారు. దీనిపై సోషల్ మీడియాలో దుమార‌మే రేగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here