మినిస్టర్ ఫోటోలకు ఫోజులివ్వాలి.. మూడు గంటల పాటు వీల్ చైర్లలో ఎండలో కూర్చున్న దివ్యాంగులు..!

బయట దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలోని రాజకీయనాయకులు చాలా ఫోజు కొడుతూ ఉంటారు. తామేదో పై నుండి ఊడిపడ్డామని భావిస్తూ ఉంటారు. తాజాగా దివ్యాంగులను ఎండలో దాదాపు మూడు గంటల పాటూ ఎదురుచూసేలా చేశాడు ఓ రాజకీయ నాయకుడు. ఇంతకూ ఎందుకు అన్ని గంటలు టైమ్ పట్టిందా అని అనుకుంటారా.. ఆయన ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఆ సమయం కాస్తా దాటిపోయింది.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చండీఘడ్ లో దివ్యాంగులకు వీల్ చైర్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అందుకు కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ ను ముఖ్య అతిథిగా పిలిపించారు. రాజనాథ్ సింగ్ గారు అప్పటికే అరగంట ఆలస్యంగా అక్కడికి వచ్చారు. వచ్చిన ఆయన పిల్లలకు ఇవ్వాల్సిన వీల్ చైర్లు ఇవ్వకుండా వేరే వాళ్ళతో కలసి మొక్కలు నాటడానికి.. ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి వెళ్ళారు.

పొద్దున్న నుండి ఏమీ తినకుండా ఆ పిల్లలు ఎండలో అలాగే ఉండిపోయారు. నిర్వాహకులు ఇదిగో ఆయన వస్తారు.. అదిగో వస్తారు అని మూడు గంటలకు పైగా పిల్లలను ఎదురుచూసేలా చేశారు. అలాగే పిల్లలకు అక్కడ నుండి పక్కకు కూడా తీసుకొని వెళ్ళనివ్వలేదు. తన రెండేళ్ళ కూతురిని తీసుకొని ఇక్కడకు వచ్చానని అనిత కుమారి అనే మహిళ తెలిపింది. ఉదయం 9 గంటల నుండి 11:30 దాటినా కూడా ఆయన పిల్లల దగ్గరకు రాలేదని చెప్పింది. నిర్వాహకులు ముందుగానే చెప్పి ఉండి ఉంటే పాపకు తినడానికి ఏదైనా తీసుకుని వచ్చేదాన్ని అని చెప్పుకొచ్చింది.

ఏది ఏమైనా మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో వీఐపీ కల్చర్ బాగా పెరిగిపోతోంది. కనీసం పిల్లలకు అక్కడ ఇవ్వల్సినవేవో ఇచ్చేసి పంపేసి.. ఆయన ఎంత మందితో ఫోటోలు దిగినా.. ఎన్ని ఫోజులు ఇచ్చి ఉన్నా కూడా పర్లేదు. నిర్వాహకులు కూడా పిల్లల పరిస్థితి ఇది.. వారి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీరు వేరే వాటికి సమయం కేటాయించండి అని అడిగుంటే కూడా పిల్లలు ఇబ్బందులు ఎదుర్కునే వాళ్ళు కాదు. ఆయన వీఐపీ కదా చెబితే ఎక్కడ నొచ్చుకుంటాడోనని వాళ్ళు భయపడి ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here