త‌న వైద్యం మీద త‌న‌కే న‌మ్మ‌కం లేక కార్పొరేట్ ఆస్ప‌త్రిలో రోగికి తాంత్రిక పూజ‌లు చేయించిన డాక్ట‌ర్

పుణే: మ‌హారాష్ట్రలోని పుణే న‌గ‌రానికి వెళ్లి ఈ సిటీలో టాప్ ఆసుప‌త్రి ఏదంటూ ఎవ‌రిన‌డిగినా `దీనానాథ్ మంగేష్క‌ర్ హాస్పిట‌ల్` అని చెబుతారు. అంత‌టి పేరుందా ఆసుప‌త్రికి. అలాంటి ఆసుప‌త్రిలో ఓ మ‌హిళా రోగి ఆరోగ్యాన్ని న‌యం చేయ‌డానికి తాంత్రిక పూజ‌ల‌ను చేశారు.

ఇదంతా ఆ ఆసుప‌త్రి రెసిడెంట్ డాక్ట‌ర్ స‌మ‌క్షంలోనే జ‌ర‌గ‌డం ఇంకో ఎత్తు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వ‌చ్చింది. ఈ పూజ‌ల త‌రువాత ఆమె ఆరోగ్య ప‌రిస్థితి ఏమిట‌నే అనుమానం రావ‌చ్చు. ఆ పూజ జ‌రిగిన కొన్ని గంట‌ల‌కే ఆమె ఆరోగ్యం విష‌మించింది.

ఆసుప‌త్రిలోనే క‌న్నుమూసింది. ఆమె పేరు సంధ్య సొణావ‌నె. పుణే స‌మీపంలోని ద‌త్తావాడికి చెందిన మ‌హిళ‌. ఛాతీ నొప్పితో ఆమె దీనానాథ్ మంగేష్క‌ర్ ఆసుప‌త్రిలో చేరింది. ఐసీయూలో ఉంచి ఆమెకు చికిత్స చేస్తూ వ‌చ్చారు డాక్ట‌ర్లు.

మొద‌ట ఆమెకు స‌ర్జ‌రీ చేశారు. ఫ‌లితం క‌నిపించ‌లేదు. దీనితో త‌న వైద్యం మీద త‌నకే న‌మ్మ‌కం లేదేమో.. ఏకంగా ఓ మంత్ర‌గాడిని పిలుచుకొచ్చి తాంత్రిక పూజ‌లు చేయించాడు. ప‌సుపు, కుంకుమ‌, నిమ్మ‌కాయ‌లతో పూజ‌లు చేయించాడు.

సాధార‌ణంగా ఐసీయూలోకి ఎవ్వ‌ర్నీ అనుమ‌తించ‌రు. చివ‌రికి- సొంత త‌ల్లిదండ్రుల‌ను కూడా రానివ్వ‌రు. అలాంటి ఐసీయూలో ఏకంగా ఆ మంత్ర‌గాడు అడుగు పెట్టాడు. తాంత్రిక పూజ‌లు చేశాడు. ఈ పూజ‌లు నిర్వ‌హించిన త‌రువాత మ‌రోసారి స‌ర్జ‌రీ చేశారు.

ఈ స‌ర్జ‌రీ తరువాత సంధ్య కోమాలోకి వెళ్లింది. కోమాలోనే క‌న్నుమూసింది. ఈ ఘ‌ట‌న‌పై సంధ్య కుటుంబీకులు ఆందోళ‌న చేప‌ట్టారు. డాక్ట‌ర్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here