వైర‌స్ సోకి.. మ‌ర‌ణం త‌ప్ప‌దని తెలిసిన త‌రువాత ఐసీయూ నుంచి భ‌ర్త‌కు లేఖ రాసిన న‌ర్సు!

లిని పుథుస్సేరి. 28 సంవ‌త్స‌రాల మ‌హిళ‌. వృత్తిరీత్యా న‌ర్స్‌. భ‌ర్త‌, ఇద్ద‌రు కుమారులు ఉన్న అంద‌మైన కుటుంబం ఆమెది. ఒక్క‌సారిగా ఆమె కేర‌ళ ప్ర‌జ‌ల‌కు ఆరాధ్యురాలైపోయారు. కార‌ణం.. కేర‌ళ‌ను క‌కావిక‌లం చేస్తోన్న నిఫా వైర‌స్ మ‌రింత వ్యాపించ‌కుండా అడ్డుకోగ‌లిగారు. దీనికోసం త‌న ప్రాణాన్ని ఫ‌ణంగా పెట్టారు.

కేర‌ళ‌ను కుదిపేస్తోన్న నిఫా వైర‌స్ మొట్ట‌మొద‌టి సారిగా సోకిన రోగుల‌కు ఆమె చికిత్స అందించారు. ఆ వైర‌స్ ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌దంటే- వైర‌స్ సోకిన రోగికి చికిత్స అందించినందుకు లినికి కూడా అంటుకుంది. దీనితో- ఆమెను పెరంబ్రాలోని ఆసుప‌త్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.

అయిన‌ప్ప‌టికీ.. ఆమె ప్రాణాల‌ను నిల‌బెట్ట‌లేక‌పోయారు డాక్ట‌ర్లు. ఇక్క‌డ ఇంకో విషాద‌క‌ర విష‌యం ఏమిటంటే- లిని మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు ఇవ్వ‌లేదు. కార‌ణం- ఆ వైర‌స్ వారికి కూడా సోకుతుందానే భ‌యంతో. లిని మృత‌దేహాన్ని ఆసుప‌త్రి బ‌య‌టికి కూడా తీసుకుని రాలేదు. విద్యుత్ ద్వారా ద‌హ‌నం చేశారు.

దీనికోసం తాత్కాలికంగా ఆసుప‌త్రిలోనే ఓ విద్యుత్ ద‌హ‌న ఏర్పాట్ల‌ను చేసింది అక్క‌డి ప్ర‌భుత్వం. త‌న మ‌ర‌ణం ఖాయ‌మైంద‌ని తెలిసిన త‌రువాత‌.. లిని త‌న భ‌ర్త సంజేష్‌కు ఓ లేఖ రాశారు. లిని ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని తెలుసుకుని రెండు రోజుల కింద‌టే ఆయ‌న కేర‌ళ‌కు వ‌చ్చారు. అప్ప‌టికే లినిని ఐసీయూలో చేర్చారు. ఇక తాను మ‌ళ్లీ క‌లుసుకోలేన‌ని, పిల్ల‌ల్ని బాగా చూసుకోవాల‌ని కోరారు.

సంజేష్ గ‌ల్ఫ్ దేశం బ‌హ్రెయిన్‌లో ప‌నిచేస్తున్నారు. ఇద్ద‌రు పిల్ల‌ల్ని కూడా బహ్రెయిన్‌కు తీసుకెళ్లాల‌ని సూచించారు. ఈ లేఖ అందిన వెంట‌నే సంజేష్ విల‌పించాడు. నిఫా వైర‌స్ సోకిన రోగుల‌కు వైద్యం చేయొద్ద‌ని తాను చెప్పిన‌ప్ప‌టికీ.. లిని వినిపించుకోలేద‌ని అన్నారు.

ఆసుప‌త్రిలో న‌ర్సుల కొర‌త ఉంద‌ని, తాను లేక‌పోతే ఇబ్బందులు వ‌స్తాయ‌ని ఆమె రోగుల‌కు సేవ చేశార‌ని సంజేష్ చెబుతున్నారు. 5, 2 సంవ‌త్స‌రాలు ఉన్న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ఎలా పెంచి పోషించాలో అర్థం కావ‌ట్లేద‌ని సంజేష్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here