కాబోయే అత్త‌తో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న! పెళ్లి పీట‌లు ఎక్కాల్సిన వ‌రుడు..పోలీస్‌స్టేషన్‌లో!

భువ‌నేశ్వ‌ర్‌: కాసేప‌ట్లో పీట‌లు ఎక్కాల్సిన వ‌రుడు అత‌ను. వేద మంత్రాల సాక్షిగా వ‌రుడి మెడ‌లో తాళి క‌ట్టాల్సి ఉంది. విడిదింటి నుంచి వైభ‌వంగా ఊరేగింపుతో పెళ్లి మంట‌పానికి బ‌య‌లుదేర‌డానికి కొన్ని క్ష‌ణాల ముందు.. ఆ యువ‌కుడు త‌న వికృత‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాడు.

పెళ్లి మంట‌పానికి ఆహ్వానించ‌డానికి వ‌చ్చిన వ‌ధువు త‌ల్లి ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించాడు కూడా. ఆమె వెంట వ‌చ్చిన బంధువునూ వ‌ద‌ల్లేదు. వారితో ఘ‌ర్ష‌ణ ప‌డ్డాడు. గొడ‌వ పెట్టుకున్నాడు. మ‌ద్యం మ‌త్తులో త‌న స్నేహితుల‌తో క‌లిసి రెచ్చిపోయాడు.

దీనితో ఆగ్ర‌హించిన వధువు త‌ర‌ఫు కుటుంబీకులు పెళ్లిని ర‌ద్దు చేశారు. అత‌నిపై పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. పెళ్లి మంట‌పానికి వెళ్లాల్సిన వ‌రుడు.. పోలీస్‌స్టేష‌న్‌లో కూర్చున్నాడు. ఆ యువ‌కుడి పేరు శంక‌ర్ పండా. ఊరు ఒడిశాలోని రూర్కేలా. ఉక్కున‌గ‌రం రూర్కేలాలోని లేబ‌ర్ కాల‌నీకి చెందిన యువ‌కుడు.

రూర్కేలాకే చెందిన అర్సుల్ పాండే కుమార్తెతో అత‌నికి పెళ్లి నిశ్చ‌య‌మైంది. ఆదివారం తెల్ల‌వారు జామున రూర్కేలాలోని శారాన‌గ‌రి జ‌గ‌న్నాథ స్వామి ఆల‌యంలో పెళ్లి. దీనికోసం శ‌నివారం అర్ధ‌రాత్రి దాటిన త‌రువాత ఊరేగింపును ఏర్పాటు చేశారు. వ‌రుడు ఊరేగింపుగా విడిదింటి నుంచి పెళ్లిమంట‌పానికి వెళ్లాల్సి ఉంది.

వారిని ఆహ్వానించ‌డానికి వ‌ధువు త‌ల్లి, ఆమె త‌ర‌ఫు బంధువులు వెళ్లారు. అప్ప‌టికే త‌న స్నేహితుల‌తో క‌లిసి మ‌ద్యం సేవించిన శంక‌ర్ పాండా.. క‌న్ను, మిన్ను మ‌రిచిపోయాడు. బంధువుల‌పై విరుచుకుప‌డ్డాడు. వ‌ధువు త‌ల్లి ఒంటిపై చేయి వేశాడు.

ఆమెతో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. దీనితో వ‌ధువు కుటుంబీకులు పెళ్లిని ర‌ద్దు చేశారు. అత‌నిపై బంధాముండా పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు శంక‌ర్ పండాను అరెస్టు చేశారు. అప్ప‌టిదాకా చేసిన పెళ్లి ఖ‌ర్చును ఇవ్వాల‌ని వధువు త‌ర‌ఫు త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here