పులికి పట్టిన గతి ఇది.. ఇంతకీ జంతువులు ఎవరు..?

ఇటీవలి కాలంలో మనుషులే మృగాళ్ళా ప్రవర్తిస్తున్నారు. అన్యాయంగా జంతువులను చంపి.. వాటితో డబ్బులు సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్న ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. జనావాసాల్లోకి వచ్చిందన్న కారణంతో చంపేశామని అక్కడి వాళ్ళు అంటున్నప్పటికీ.. అడవుల నుండి తీసుకొని వచ్చి చంపేశారని.. ఆ పులి శరీర భాగాలను అమ్ముకున్నారని జంతు ప్రేమికులు భావిస్తున్నారు.

అక్కడ కొద్ది రోజుల క్రితమే ఓ ఒరాంగుటాన్ ను 130 సార్లు కాల్చి చంపేశారట. ఇప్పుడు సుమత్రా పులి మండైలింగ్ నాటల్ గ్రామంలో ఈ చావు చచ్చింది. దాని పళ్ళను, గోర్ల, ముఖానికి ఉన్న చర్మాన్ని.. చివరికి తోకను కూడా లాక్కొని వెళ్లిపోయారట. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. పులిని పైన వేలాడదీయగా.. కింద గ్రామస్థులంతా చూస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే తమ గ్రామం దగ్గర పులి తిరుగుతోందని స్థానికులు అక్కడి పోలీసులకు, అటవీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వారు పులిని బంధించాలని భావిస్తున్న తరుణంలో గ్రామస్థులే ఎక్కడ దాడి చేస్తుందోనని దాన్ని వెంటాడి చంపేశారట.

పులి నుండి కాజేసిన చర్మాన్ని, వాటి గోర్లను అక్కడ మందుల్లో ఉపయోగిస్తారు. అలాగే కొందరికి బహుమతులుగా కూడా ఇస్తారట. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రపంచంలో కేవలం 400 సుమత్రా పులులు మాత్రమే ఉన్నాయట.. ఇప్పటికే అవి అంతరించిపోతున్నాయి.. ఇలాంటి తరుణంలో వాటిని ఇంత అరాచకంగా చంపేయడం చాలా.. చాలా.. తప్పని జంతు ప్రేమికులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here