ప్రియుడితో పెళ్ళి కోసం దొంగ డాక్టర్ అయింది.. ఆసుపత్రి లోకి వెళ్ళి పేషెంట్ లను చెక్ చేయబోయింది..!

ఆమె ఏమీ పెద్ద మోసగత్తె కాదు.. వైద్యం పేరుతో ఎవరి ప్రాణాలూ తీయలేదు.. కేవలం తాను పెళ్ళి చేసుకుందాం అని అనుకున్న వ్యక్తికి తాను డాక్టర్ ను అని చెప్పడానికి చేసిన చిన్న ప్రయత్నం ఆమెను కటకటాల పాలు చేసింది. శంకర్ దాదా సినిమాలో తండ్రిని నమ్మించడానికి సొంతంగా ఆసుపత్రిని క్రియేట్ చేస్తారు.. కానీ ఈమెకు అంత ఛాన్స్ లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ గా నటించడం మొదలు పెట్టింది అంతే..! కానీ ఆమె మీద అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె చేసిన తప్పు బయటపడింది.

సంగారెడ్డి జిల్లాకు చెందిన రిజ్వానాబేగం (32) భర్తతో విడాకులు తీసుకుని సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఉంటోంది. ఈ క్రమంలో స్థానికంగా నివసించే అబ్దుల్ కరీంతో ఏర్పడిన పరిచయం ప్రేమ వరకు వెళ్లింది. తాను డాక్టర్‌నని, గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇదే ఆమె చేసిన తప్పు.. ఈ క్రమంలో ప్రియుడి బంధువు ఒకామె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చేరింది. గాంధీలోనే తన ప్రియురాలు పనిచేస్తుండడంతో బాధితురాలికి సాయం చేయాలని, దగ్గరుండి చూసుకోవాలని ప్రియురాలు రిజ్వానాను కరీం కోరాడు.

దీంతో రిజ్వానాకు ఏమి చేయాలో తెలీక ఓ ఏప్రాన్, స్టెతస్కోప్ కొనుగోలు చేసి డాక్టర్ గా గాంధీ ఆసుపత్రి లోకి అడుగుపెట్టింది. రెండు రోజులుగా గాంధీ ఆసుపత్రిలోకి వెళ్లి వస్తోంది. సిబ్బంది ప్రశ్నించిన ప్రతిసారీ ఏప్రాన్, స్టెతస్కోప్‌లను చూపిస్తూ తప్పించుకుంది. గురువారం నాడు ప్రియుడు కరీంతోపాటు అతడి మిత్రుడు మొయినుద్దీన్‌లను తీసుకుని ఆసుపత్రి ఐసీయూ వద్దకు వచ్చింది. ఇక్కడే ట్విస్ట్ వచ్చింది.. అక్కడి సిబ్బందికి డౌట్ వచ్చి ఎవరమ్మా నువ్వు అని అడిగారు.. ఇక్కడే వైద్యురాలిగా పనిచేస్తున్నానని చెప్పి చేతిలోని ఏప్రాన్, స్టెతస్కోప్‌లను రిజ్వానా చూపించింది. అయినా నమ్మని సిబ్బంది గుర్తింపు కార్డు చూపించమంటే ఇంటి దగ్గర మర్చిపోయానని చెప్పింది. దీంతో వారిని తీసుకెళ్లి పీఐసీయూ వార్డులో ఆరా తీయగా ఆమె ఎవరో తెలియదని చెప్పడంతో అడ్డంగా దొరికిపోయింది. పోలీసులు ఆమెను విచారిస్తూ ఉన్నారు. డాక్టర్ గా వేషం అయితే వేసుకుంది కానీ ఎవరికీ ఎటువంటి ట్రీట్మెంట్ చేయలేదట. ఎవరైనా ఆమె దగ్గరికి వచ్చినా అక్కడికి వెళ్ళండి.. ఇక్కడికి వెళ్ళండి అని చెప్పి పంపించేదట..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here