పెళ్ల‌యి మూడునెల‌లే! అంతలోనే..!

రామ‌న‌గ‌ర‌: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న వారు న‌వ దంప‌తులు. పెళ్ల‌యి మూడు నెల‌లు కూడా పూర్తిగా నిండ‌నేలేదు. అప్పుడే వారికి నూరేళ్లు నిండాయి. ప్ర‌మాదవ‌శావ‌త్తూ చెరువులో ప‌డి జ‌ల స‌మాధి అయ్యారు. త‌మ బంధువు కుమార్తెలు ఇద్ద‌రూ చెరువులో ప‌డి మునిగిపోతుండ‌టంతో.. వారిని కాపాడ‌టానికి ఒక‌రి త‌రువాత ఒక‌రుగా వెళ్లి ఆ ఇద్ద‌రు దంపతులు మ‌ర‌ణించారు.

ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని రామ‌న‌గ‌ర జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలో చెన్న‌ప‌ట్ట‌ణ‌లోని హ‌నుమంత‌న‌గ‌ర‌లో నివ‌సించే శేఖ‌ర్, సుమ దంప‌తుల‌కు మూడునెల‌ల కింద‌టే వివాహ‌మైంది. ఈ న‌వ దంప‌తులు చిక్కెన‌హ‌ళ్లి గ్రామంలో నివ‌సించే సుమ సోద‌రి శకుంత‌ల ఇంటికి ఆతిథ్యానికి వెళ్లారు.

ఆదివారం సెల‌వురోజు కావ‌డంతో శేఖ‌ర్‌, సుమ స‌ర‌దాగా చిక్కెన‌హ‌ళ్లి స‌మీపంలోని చెరువుకు వెళ్లారు. త‌మ వెంట శ‌కుంత‌ల కుమారుడు ధ‌ను, కుమార్తె హంసను కూడా తీసుకెళ్లారు. చెరువులో స్నానం చేయ‌డానికి ధ‌ను, హంస ప్ర‌మాదవ‌శావ‌త్తూ మునిగిపోసాగారు. వారిని కాపాడ‌టానికి శేఖ‌ర్ చెరువులో దిగాడు.

అత‌ను కూడా మునిగిపోతుండ‌టంతో సుమ కూడా చెరువులో దిగారు. వారెవ‌రికీ ఈత రాదు. దీనితో శేఖ‌ర్‌, సుమ‌, ధ‌ను జ‌ల‌స‌మాధి అయ్యారు. వారిని చూసిన స్థానికులు హంస‌ను కొస ప్రాణాల‌తో కాపాడారు.

ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా..అక్క‌డ చికిత్స పొందుతూ హంస కూడా మ‌ర‌ణించింది. ఈ ఘ‌ట‌నతో రెండు కుటుంబాల్లోనూ పెను విషాద‌ఛాయ‌లు అల‌ముకున్నాయి. ఈ స‌మాచారం అందుకున్న వెంట‌నే రామ‌న‌గ‌ర రూర‌ల్ పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here