కుమారుడి ప్రాణానికి త‌న ప్రాణాన్ని అడ్డు వేసిన తండ్రి

నీటి కుంట‌లో ప‌డి మృత్యువుకు చేరువైన క‌న్న కుమారుడిని కాపాడుకోవ‌డానికి ఓ తండ్రి ప్రాణాల‌కు తెగించాడు. త‌న ప్రాణాన్ని అడ్డుగా వేసి, కుమారుడిని కాపాడుకోగ‌లిగాడు. అదే నీటి కుంట‌లో కూరుకుపోయి..జ‌ల‌స‌మాధి అయ్యాడు. క‌ర్ణాట‌క‌లోని మండ్య జిల్లాలో చోటు చేసుకున్న విషాద‌క‌ర ఘ‌ట‌న ఇది.

జిల్లాలోని నాగ‌మంగ‌ల తాలూకా ప‌రిధిలోని బీరేశ్వ‌ర గ్రామానికి చెందిన ఫిరోజ్ భార్య జుబిన్ తాజ్‌తో క‌లిసి నివ‌సిస్తున్నాడు. వారికి ఏడాది కుమారుడు ఉన్నాడు. ఆదివారం సాయంత్రం జుబిన్ త‌న ఏడాది కుమారుడిని ఎత్తుకుని, బ‌ట్ట‌లు ఉత‌క‌డానికి బీరేశ్వ‌ర గ్రామ శివార్ల‌లోని చెరువు వ‌ద్ద‌కు వెళ్లింది. వారి వెంట ఫిరోజ్ కూడా వెళ్లాడు.

బ‌ట్ట‌లు ఉతికే స‌మ‌యంలో అక‌స్మాత్తుగా వారి కుమారుడు చెరువులో ప‌డిపోయాడు. ఏడాది వ‌య‌స్సే కావ‌డంతో మునిగిపోయాడు. దీన్ని చూసిన వెంట‌నే ఫిరోజ్ చెరువులోకి దూకాడు. త‌న‌కు ఈత రాద‌ని తెలిసిన‌ప్ప‌టికీ.. నీట మునుగుతున్న కుమారుడిని చూసి ఆగ‌లేక‌పోయాడు.

కుమారుడిని అతిక‌ష్టం మీద భార్య చేతికి అప్ప‌గించాడు. చెరువులో పేరుకుపోయిన బుర‌ద‌లో చిక్కుకుని జ‌ల‌స‌మాధి అయ్యాడు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ఫిరోజ్ మృత‌దేహాన్ని వెలికి తీశారు. చిన్నారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here