భార్య‌తో గొడ‌వ‌ప‌డి ఇద్ద‌రు కుమారుల‌ను బ‌య‌టికి లాక్కెళ్లిన భ‌ర్త‌.. ముగ్గురూ మృత‌దేహాలై తేలారు!

త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను వ్య‌వ‌సాయ బావిలోకి తోసి చంపేశాడో తండ్రి. ఆ త‌రువాత తానూ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని క‌ల‌బుర‌గి జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని చించోళి తాలూకా ప‌రిధిలోని హుడ‌ద‌ళ్లి గ్రామానికి చెందిన రంగ‌య్య త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. అత‌నికి భార్య‌, ఇద్ద‌రు కుమారులు అయిదేళ్ల శివ‌కుమార్‌, రెండేళ్ల శ్రీ‌కాంత్ ఉన్నారు.

కొద్దిరోజులుగా అత‌ని ఆరోగ్యం బాగుండ‌ట్లేదు. మానసిక ఒత్తిళ్ల‌ను ఎదుర్కొంటున్నాడు. దీనితో రోజూ అత‌ను భార్య‌తో గొడ‌వ ప‌డుతుండేవాడు. బుధ‌వారం కూడా అత‌ను భార్య‌తో ఘ‌ర్ష‌ణ ప‌డ్డాడు.

ఆవేశానికి గురై.. ఇంట్లోనే ఉన్న శివ‌కుమార్‌, శ్రీ‌కాంత్‌ను తీసుకెని బ‌య‌టికెళ్లిపోయాడు. వాళ్లే తిరిగి వ‌స్తార‌ని ఆశించింది భార్య‌. ఎంత సేప‌యిన‌ప్ప‌టికీ వారు తిరిగి ఇంటికి రాక‌పోవ‌డంతో ఆమె ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

ఇరుగుపొరుగు వారికి ఈ విష‌యాన్ని తెలిపారు. అంద‌రూ క‌లిసి వెద‌గ్గా.. గ్రామ శివార్ల‌లోని వ్య‌వ‌సాయ బావిలో శివ‌కుమార్‌, శ్రీ‌కాంత్ మృత‌దేహాలు తేలియాడుతూ క‌నిపించాయి. వ్య‌వ‌సాయ బావి ప‌క్క‌నే ఉన్న చెట్టుకు వేలాడుతూ రంగ‌య్య మృత‌దేహం క‌నిపించింది.

ఈ స‌మాచారాన్ని గ్రామ‌స్తులు సులెపేటె పోలీసుల‌కు తెలియ‌జేశారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here