ట్యూష‌న్‌కు వెళ్తున్నామంటూ వెళ్లిన విద్యార్థులు..!

ట్యూష‌న్‌కు వెళ్తున్నామంటూ ఇంట్లో నుంచి బ‌య‌లుదేరి వెళ్లిన అయిదుమంది విద్యార్థులు.. ప‌త్తా లేకుండా పోయారు. సోమ‌వారం సాయంత్రం బెంగ‌ళూరులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పాఠ‌శాల నుంచి ఇంటికి వ‌చ్చిన ఆ అయిదుమందీ.. గంట త‌రువాత ట్యూష‌న్ కంటూ బ‌య‌లుదేరి వెళ్లారు. సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు వారికి ట్యూష‌న్ ఉంటుంది.

ఏడు దాటిన‌ప్ప‌టికీ.. త‌మ పిల్ల‌లు ఇంటికి రాక‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు ట్యూష‌న్‌కు వెళ్లారు. ఆ అయిదుమందీ అస‌లు ట్యూష‌న్‌కే రాలేద‌ని తేలింది. దీనితో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన త‌ల్లిదండ్రులు.. వారి కోసం అన్ని చోట్లా వెదికారు. వారి స్నేహితులు, బంధువుల ఇళ్ల‌ల్లో ఆరా తీశారు. ఎక్క‌డా వారి జాడ క‌నిపించ‌లేదు.

మంగ‌ళ‌వారం ఉద‌యం వారు కామాక్షిపాళ్య పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఒకేసారి, ఒకే ప్రాంతానికి చెందిన అయిదుమంది విద్యార్థుల జాడ తెలియ‌కుండా పోవ‌డంతో స్థానికంగా క‌ల‌క‌లం చెల‌రేగింది. సెయింట్ క్లారెన్స్‌లో, ఒకే సెక్ష‌న్‌లో ఆ అయిదుమంది విద్యార్థినులు చ‌దువుకుంటున్నారు. అదృశ్య‌మైన వారిలో ఒక‌రి వ‌ద్ద సెల్‌ఫోన్ ఉన్న‌ట్లు తేలింది.

దీనితో- ఆ నంబ‌ర్‌కు ఫోన్ చేయ‌గా.. స్విచాఫ్ వ‌చ్చింది. కామాక్షిపాళ్య ట‌వ‌ర్ లొకేష‌న్‌లోనే ఫోన్ స్విచాఫ్ అయిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. కేసు న‌మోదు చేసుకున్న వెంట‌నే కామాక్షిపాళ్య పోలీసులు యుద్ధ ప్రాతిప‌దిక‌న గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. రైల్వేస్టేష‌న్లు, బ‌స్‌స్టాండ్ల‌తో పాటు అన్ని పోలీస్‌స్టేష‌న్ల‌కూ ఫొటోల‌ను పంపించారు. అయిదుమంది విద్యార్థుల కోసం గాలిస్తున్నామ‌ని విజ‌య‌న‌గ‌ర ఏసీపీ ప‌ర‌మేశ్వ‌ర హెగ్డె తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here