గ్రేట్ ఎస్కేప్‌! స‌ముద్రంలో జారిప‌డబోయి ఆగిపోయింది: 162 మంది సేఫ్‌

ట్రాబ్‌జ‌న్ ఎయిర్‌పోర్ట్‌. ట‌ర్కీలోని ట్రాబ్‌జ‌న్ న‌గ‌రంలో ఉంటుందీ విమానాశ్ర‌యం. న‌ల్ల‌స‌ముద్రానికి ఆనుకునే ఉంటుందీ ఎయిర్‌పోర్ట్‌. ఎంత ఆనుకుని ఉంటుందంటే.. ఎయిర్‌పోర్ట్ ర‌న్‌వే నుంచి 200 మీట‌ర్లు కూడా ఉండ‌దు న‌ల్ల‌స‌ముద్రం.

అలాంటి చోట ఓ భారీ విమానం జారిపోయింది. ర‌న్‌వేపై మంచు ఉండ‌టంతో..ల్యాండ్ అయిన వెంట‌నే స్కిడ్ అయ్యింది. నేరుగా న‌ల్ల‌స‌ముద్రం వైపు శ‌ర‌వేగంగా దూసుకెళ్లింది.

ఒడ్డు మీది నుంచి జారింది కూడా. వ‌ర్షం వ‌ల్ల న‌ల్ల‌స‌ముద్రం ఒడ్డున బుర‌ద‌మ‌ట్టి పేరుకుపోవ‌డంతో.. అందులో చిక్కుకుపోయిందా భారీ విమానం. ఆ స‌మ‌యంలో విమానంలో 162 మంది ప్ర‌యాణికులు, సిబ్బందీ ఉన్నారు.

చివ‌రి నిమిషంలో వారంతా బ‌తికిపోయారు. అచ్చంగా హాలీవుడ్ సినిమాలోలా చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న.  స‌ముద్రమ‌ట్టానికి, విమానానికి మ‌ధ్య ఉన్న దూరం కేవ‌లం 50 మీట‌ర్లే.

విమానం మొత్తం స‌ముద్రంలో మునిగిపోయి ఉండేది. ట‌ర్కీ రాజ‌ధాని అంకారా నుంచి బ‌య‌లుదేరిన పెగాస‌స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పీసీ 8622 ర‌కం విమానం 90 నిమిషాల త‌రువాత ట్రాబ్‌జ‌న్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది.

ల్యాండైన వెంట‌నే ప్ర‌మాదానికి గురైంది. ర‌న్‌వే మీది నుంచి చూస్తే.. విమానం తోక త‌ప్ప మ‌రేదీ క‌నిపించ‌లేదు. ఆ రేంజ్ స‌ముద్రంలో ప‌డ‌బోతూ త‌మాయించుకుంది. విమానం ఏ కాస్త వేగంగా ముందుకు వ‌చ్చి ఉన్న‌ప్ప‌టికీ.. ప్రాణ‌న‌ష్టం భారీగా ఉండేది.

స‌మాచారం అందుకున్న వెంట‌నే స్థానిక పోలీసులు, భ‌ద్ర‌త బ‌ల‌గాలు, అగ్నిమాప‌క సిబ్బంది సంఘట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ప్ర‌యాణికులను ర‌క్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here