ఫోరెన్సిక్ రిపోర్టులో తేలిందేమిటంటే.. ఆ వాయిస్ చంద్రబాబు నాయుడుదే..!

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుకు ఉచ్చు మరింతగా బిగుసుకుపోతోంది. ఆ ఫోన్ కాల్ లో మాట్లాడింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని ఫోరెన్సిక్ రిపోర్ట్ లో తేల్చారు. చండీగఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక రాగా, నిన్న ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. ఆడియో టేపుల్లో వినిపిస్తున్న గొంతు ఏపీ సీఎం చంద్రబాబుదేనని ల్యాబ్ పరీక్షలు నిర్ధారించాయని తెలిపారు. నాలుగు రోజుల క్రితమే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక తెలంగాణ పోలీసులకు అందగా, కేసును కొలిక్కి తెచ్చేందుకు గత నాలుగు రోజులుగా ఏసీబీ అధికారులు కసరత్తు చేసినట్టు తెలిసింది.

ఈ కేసులో జూలై 28, 2015న తొలి చార్జ్ షీట్ దాఖలు చేసింది ఏసీబీ. వెంటనే చంద్రబాబు నాయుడు స్టే కూడా తెచ్చేసుకున్నాడు. అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా ఈ నెల చివరి వారంలో మరో చార్జ్ షీట్ వేయనున్నట్టు సమాచారం. కేసీఆర్ ను కలిసిన వారిలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్ రావు, మాజీ డీజీ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ తదితరులు ఉన్నారు. పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని, చట్టం ముందు అందరూ సమానమేనని, కేసు విచారణలో ముందుకెళ్లాలని సూచించినట్టు కేసీఆర్ తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here