భర్త షిర్డీలో..భార్య ఇంట్లో ఫ్యానుకు..!

ఓ టాప్ తెలుగు ఛాన‌ల్‌లో ప‌నిచేసిన యాంక‌ర్ ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న కృష్ణా జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. ఆ యాంక‌ర్ పేరు తేజ‌స్విని. జిల్లాలోని కంకిపాడు మండలంలో ఈడుపుగల్లులో భ‌ర్త‌, అత్తామామ‌ల‌తో క‌లిసి నివ‌సిస్తోన్న తేజ‌స్విని.. ఇంట్లో ఉరి వేసుకుని బ‌ల‌వన్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. దీనికి గ‌ల కార‌ణాలేమిట‌న్న‌ది స్ప‌ష్టంగా తెలియ‌రాలేదు.

గుంటూరు జిల్లా నల్లపాడు గ్రామానికి చెందిన పవన్‌కుమార్, తేజస్విని అయిదేళ్ల కింద‌ట పెళ్లి చేసుకున్నారు. వారిది ప్రేమ‌ వివాహం. కులాలు వేరు కావ‌డంతో పెద్ద‌లు ఈ కులాంత‌ర వివాహానికి ఒప్పుకోలేదు. దీనితో- వారు పెద్ద‌ల‌ను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ప‌వ‌న్ కుమార్ ఉయ్యూరులో ఓ ప్రైవేటు సంస్థ‌లో ఉద్యోగం చేస్తుండ‌గా.. తేజ‌స్విని విజ‌య‌వాడ కేంద్రంగా ప‌నిచేస్తోన్న ఓ తెలుగు ఛాన‌ల్‌లో యాంక‌ర్‌గా చేరారు. రెండేళ్ల కింద‌ట ఆ దంప‌తుల‌కు ఓ పాప జ‌న్మించింది.

అప్ప‌టి నుంచి ప‌వ‌న్‌కుమార్ త‌ల్లి వెంక‌ట్రావ‌మ్మ ఈడుపుగ‌ల్లులో ప‌వ‌న్ ఇంట్లో నివ‌సించ‌సాగారు. ఈ నెల 14న పవన్ కుమార్ షిర్డీ వెళ్లారు. అదే స‌మ‌యంలో తేజస్విని, వెంకట్రావమ్మ మ‌ధ్య గొడ‌వ చోటు చేసుకుంది. అది ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసిన‌ట్లు చెబుతున్నారు.

దీనితో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన తేజస్విని త‌న గ‌దిలోకి వెళ్లి త‌లుపేసుకున్నారు. మొద‌ట్లో వెంక‌ట్రావ‌మ్మ‌ దీన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. గంట‌లు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ.. కోడ‌లు గ‌ది త‌లుపు తీయ‌క‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన ఆమె ఇరుగు పొరుగును పిల‌వ‌గా.. వారు త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టారు.

లోన‌- ఫ్యాన్‌కు వేలాడుతూ తేజ‌స్విని మృత‌దేహం క‌నిపించింది. హ‌తాశురాలైన వెంక‌ట్రావ‌మ్మ, స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here