ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు..!

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధానిలో ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మ‌ర‌ణించారు. న్యూఢిల్లీలోని పీతమ్‌పుర ప్రాంతంలోని కోహ‌ట్ ఎన్‌క్లేవ్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్లే ఈ ప్ర‌మాదం చోటు చేసుకుని ఉంటుంద‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్దారించారు.

శుక్ర‌వారం తెల్ల‌వారు జామున 2:45 నిమిషాల స‌మ‌యంలో కోహ‌ట్ ఎన్‌క్లేవ్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. పార్కింగ్ స్థ‌లంలో మొద‌ట మంట‌లు అంటుకున్నాయ‌ని, క్ర‌మంగా మొద‌టి అంత‌స్తుకు వ్యాపించాయ‌ని చెబుతున్నారు. మొద‌టి అంత‌స్తులో రాకేశ్ నాగ్‌పాల్ కుటుంబం నివ‌సిస్తోంది. నిద్ర‌పోతుండ‌టం వ‌ల్ల వారు మంట‌ల‌ను గుర్తించ‌లేదు.

ఒక్క‌సారిగా మొద‌టి అంత‌స్తును అగ్నికీల‌లు చుట్టుముట్టాయి. ఈ ఘ‌ట‌న‌లో రాకేశ్ నాగ్‌పాల్‌, ఆయ‌న భార్య టీనా, కుమారుడు హిమాన్షు, కుమార్తె శ్రేయ మ‌ర‌ణించారు. ఆ న‌లుగురు మంట‌ల వ‌ల్ల చ‌నిపోలేదని, ద‌ట్ట‌మైన పొగ వెలువ‌డ‌టం వ‌ల్ల ఊపిరి ఆడ‌క చ‌నిపోయిన‌ట్లు డాక్ట‌ర్లు నిర్దారించారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే ల‌జ‌ప‌త్ న‌గ‌ర్ పోలీసులు, 10 అగ్నిమాప‌క ద‌ళాలు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నాయి. సుమారు రెండున్న‌ర గంట‌ల త‌రువాత అగ్నికీల‌లు, పొగ అదుపులోకి వ‌చ్చాయి. పార్కింగ్ స్థ‌లంలో ఉన్న విద్యుత్ మీట‌ర్‌లో నిప్పుర‌వ్వ‌లు చెల‌రేగ‌డం చూశాన‌ని సెక్యూరిటీ గార్డు చెబుతున్నాడు. పార్కింగ్ స్థ‌లంలో ఉంచిన కార్లు మంట‌ల బారిన ప‌డి బుగ్గి అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here