అనంత‌గిరికి బ‌య‌ల్దేరి..అనంత లోకాల‌కు! ఒక్క‌డు మిగిలాడు!

తెలంగాణ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు విద్యార్థులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మ‌రొక‌రు తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. న‌ర్సాపూర్ స‌మీపంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అతి వేగ‌మే దీనికి కార‌ణ‌మ‌ని పోలీసులు ధృవీక‌రించారు. నర్సాపూర్‌ ప్రధాన రహదారిలో అర్ధరాత్రి తర్వాత ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.

సూరారం సాయిబాబానగర్‌లో నివ‌సించే రామారావు, ఉదయ్, హేమసుందర్, గణేష్, కిరణ్ స్నేహితులు. వికారాబాద్ స‌మీపంలోని అనంత‌గిరి కొండ‌ల్లో విహ‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికోసం వారు సొంతంగా డ్రైవ్ చేసుకునేలా కారును అద్దెకు మాట్లాడుకున్నారు. రామారావుకు డ్రైవింగ్ వ‌చ్చు.

సూర్యోద‌యానికి ముందే అనంత‌గిరికి చేరుకోవాల‌నే ఉద్దేశంతో అర్ధ‌రాత్రి దాటిన త‌రువాత వారు సూరారం కాల‌నీ నుంచి బ‌య‌లుదేరారు. రామారావు కారు నడుపుతున్నాడు. కారు నర్సాపూర్‌ రహదారిపైకి చేరుకున్న కొద్ది సేప‌టికే ప్ర‌మాదానికి గురైంది. కారు అదుపు త‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. ఢీ కొట్టిన వెంట‌నే ప‌ల్టీలు కొట్టిన కారు.. సుమారు వంద మీట‌ర్ల వ‌ర‌కూ దొర్లుకుంటూ వెళ్లి, చెట్టును ఢీకొని ఆగిపోయింది.

ఘటనా స్థలంలోనే రామారావు, ఉదయ్‌ ప్రాణాలు విడిచారు. గ‌ణేష్‌, కిరణ్‌, హేమ‌సుంద‌ర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ను చూసిన న‌ర్సాపూర్ పారిశ్రామిక‌వాడ‌ కార్మికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ముగ్గుర్నీ ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా గ‌ణేష్‌, కిర‌ణ్ మ‌ర‌ణించారు. హేమసుంద‌ర్ కొస ప్రాణాల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here