స‌ముద్రంలో నుంచి కొట్టుకొచ్చింది! అదేంటో ఇప్ప‌టికీ ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు!

తెల్ల‌వారు జామున వేట‌కు వెళ్ల‌డానికి స‌ముద్ర తీరానికి వ‌చ్చిన మ‌త్స్య‌కారుల‌కు.. తెల్లటి వ‌స్తువు ఒక‌టి ఆక‌ర్షించింది. ప‌రుగు, ప‌రుగున దాని వ‌ద్ద‌కు వెళ్లి చూసి, షాక్‌కు గుర‌య్యారు. కుక్క‌పిల్ల మాదిరిగా ఒంటినిండా తెల్ల‌టి వెంట్రుక‌ల‌తో జ‌డ‌లు, జ‌డ‌లుగా ఉన్న ఆ స‌ముద్ర జీవి ఏమిటో వారికి ఓ ప‌ట్టాన అర్థం కాలేదు.

ఎంత బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకున్న‌ప్ప‌టికీ.. అదెలాంటి స‌ముద్ర‌పు ప్రాణి అనేది అంతుచిక్క‌లేదు. అస‌లు స‌ముద్ర‌పు ప్రాణేనా? లేక ఏ గ్ర‌హం నుంచి ఊడిప‌డిందో అని త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఫిలిప్పీన్స్‌లోని ఓరియంట‌ల్ మిండోరో ప్రావిన్స్ స‌ముద్ర తీర ప్రాంతంలో శుక్ర‌వారం క‌నిపించిందీ ఈ వింత ప్రాణి.

స‌ముద్రపు గ‌ర్భంలో, ఎక్క‌డో, ఎవ‌రికీ అంతుచిక్కని ప్రాంతాల్లో నివ‌సించే ప్రాణి అయి ఉంటుందని అంటున్నారు. అలాంటి జీవి నిర్జీవంగా తీర ప్రాంతానికి కొట్టుకుని రావ‌డం ప‌ట్ల స్థానికులు భయాందోళ‌నలు రేకెత్తుతున్నాయి. త్వ‌ర‌లో సంభ‌వించే పెను ప్ర‌మాదానికి ఇది సంకేత‌మా? అనే అనుమానాల‌ను వారు వ్య‌క్తం చేస్తున్నారు.

స‌ముద్ర గ‌ర్భంలో భారీ భూకంపాలు చోటు చేసుకునే స‌మ‌యాల్లో మాత్ర‌మే ఇలాంటి అరుదైన ప్రాణులు నిర్జీవంగా ఒడ్డుకు కొట్టుకు వ‌స్తాయ‌నే సందేహం వారిని తొలిచేస్తోంది. భ‌విష్య‌త్తులో ఏదైనా ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి ఎదురు కావ‌డం ఖాయ‌మ‌నే భ‌యం వారి మాట‌ల్లో క‌నిపిస్తోంది.

ఈ వింత ప్రాణి బ‌య‌ట‌ప‌డింద‌నే స‌మాచారం తెలుసుకున్న ప‌ర్యావ‌ర‌ణ నిపుణులు, స‌ముద్ర జ్ఞాన శాస్త్ర‌వేత్త‌లు సంఘట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఆ వింత‌జీవిపై ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఇప్ప‌టిదాకా తాము ఇలాంటి జీవిని చూడ‌లేద‌ని శాస్త్ర‌వేత్త‌లు, నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here