టాన్సిల్స్‌కు చికిత్స కోసం ఆసుప‌త్రికి వెళ్తే..ప్రాణాలు పోయాయి!

టాన్సిల్స్ వ‌చ్చిన ఆ బాలిక రెండురోజులుగా ఆహారాన్ని ముట్టుకోలేదు. టాన్సిల్స్ వ‌ల్ల నోట్లో ఏదీ దిగ‌లేదు. టాన్సిల్స్‌తో బాధ‌ప‌డుతూ ఆసుప‌త్రికి వెళ్ల‌గా.. అక్క‌డి డాక్ట‌ర్లు ఇచ్చిన ట్రీట్‌మెంట్ దెబ్బ‌కు ఏకంగా ఆ బాలిక ప్రాణ‌మే పోయింది. తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతురాలి పేరు ప్రేమాంజ‌లి.

వ‌య‌స్సు 13 సంవ‌త్స‌రాలు. ఏడవ త‌ర‌గ‌తి విద్యార్థిని. జిల్లాలోని రాయవరం మండలం వెదురుపాకకు చెందిన ప్రేమాంజ‌లి టాన్సిల్స్‌తో బాధ‌ప‌డుతోంది. ఎంత‌కూ త‌గ్గ‌క‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు ఆమెను బుధవారం సాయంత్రం కాకినాడ ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రికి తీసుకొచ్చారు. ఈఎన్‌టీ విభాగంలో చూపించారు. అక్క‌డే అడ్మిట్ అయ్యారు.

గురువారం ఉద‌యం ప్రేమాంజ‌లికి ఉన్న‌ట్టుండి జ్వ‌రం సోకింది. దీనితో న‌ర్సు ఆమెకు ఇంజ‌క్ష‌న్ ఇచ్చారు. ఆ త‌రువాత క‌డుపులో మంట‌తో బాధ‌ప‌డింది ప్రేమాంజ‌లి. ఆ త‌రువాత కొద్దిసేప‌టికి ఒళ్లంతా దద్దుర్లు లేచాయి. విరేచనాలు మొద‌ల‌య్యాయి. నోట్లో నుంచి రక్తం వచ్చింది. వెంట‌నే ఐసీయూకి త‌ర‌లించి, చికిత్స ఆరంభించారు డాక్ట‌ర్లు.

కొంత సేప‌టికే- ఆ పాప ప్రాణం విడిచింది. ప్రేమాంజ‌లి చ‌నిపోయింద‌ని మ‌ధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యంలో డాక్ట‌ర్లు త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం ఇచ్చారు. న‌ర్సు ఇచ్చిన ఇంజక్ష‌న్ విక‌టించి.. త‌మ కుమార్తె మ‌ర‌ణించింద‌ని అంటూ త‌ల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వ‌ద్ద ఆందోళ‌న చేశారు. ఈ ఘ‌ట‌న‌పై కాకినాడ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here