నిశ్చితార్థం రోజు అదృశ్యం..మ‌రుస‌టి రోజు ప్రియుడిని పెళ్లి చేసుకుని ప్ర‌త్య‌క్షం!

త‌న‌కు ఇష్టం లేని పెళ్లి చేస్తుండ‌టంతో ఇంట్లో నుంచి పారిపోయిందో యువ‌తి. తాను ప్రేమించిన యువ‌కుడిని పెళ్లాడింది. నిశ్చితార్థానికి మ‌రుస‌టి రోజు, భ‌ర్త‌తో క‌లిసి ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని మైసూరు జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని నంజ‌న‌గూడు తాలూకా కురిహుండి గ్రామానికి చెందిన ఛైత్ర అనే యువ‌తి అదే గ్రామానికి చెందిన కృష్ణ‌మూర్తిని ప్రేమించింది. వారిద్ద‌రూ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విష‌యం తెలిసిన త‌రువాత ఛైత్ర త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హోద‌గ్రుల‌య్యారు. త‌మ కుమార్తెకు వేరే యువ‌కుడితో పెళ్లిని నిశ్చ‌యించారు.

శుక్ర‌వారం సాయంత్రం ఈ నిశ్చితార్థం జ‌ర‌గాల్సి ఉంది. అదే రోజు తెల్ల‌వారుజాము నుంచి ఛైత్ర క‌నిపించ‌కుండాపోయింది. కృష్ణ‌మూర్తితో క‌లిసి ఇంట్లో నుంచి పారిపోయిన‌ట్టు గుర్తించారు. దీనిపై నంజ‌న‌గూడు పోలీస్‌స్టేష‌న్‌లో కిడ్నాప్ కేసు న‌మోదు చేశారు.

మ‌రుస‌టి రోజు ఉద‌య‌మే ఛైత్ర.. కృష్ణ‌మూర్తితో క‌లిసి నంజ‌న‌గూడు పోలీస్‌స్టేష‌న్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. నంజ‌న‌గూడు ప‌ర‌శురాముడి ఆల‌యంలో కృష్ణ‌మూర్తిని పెళ్లి చేసుకున్న‌ట్లు పోలీసుల‌కు వెల్ల‌డించింది. పోలీసులు ఛైత్ర త‌ల్లిదండ్రుల‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here