కండ‌ల హీరోను క‌లుసుకోవ‌డానికి..ఇంత సాహ‌స‌మా?

ముంబై: తాను అభిమానించే హీరోను క‌లుసుకోవ‌డానికి సాహ‌సానికి పూనుకుందో బాలిక‌. ఇంట్లో చెప్ప‌కుండా పారిపోయి ముంబైకి వ‌చ్చింది. ఆ అభిమాని వ‌య‌స్సు కేవలం 15 సంవ‌త్స‌రాలే. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బిరేషియా గ్రామానికి చెందిన ఆ బాలిక 850 కిలోమీట‌ర్ల దూరం ఒంట‌రిగా ప్ర‌యాణించి ముంబైకి చేరుకుంది.

ముంబై సీఎస్టీలో రైలు దిగిన త‌రువాత స‌ల్మాన్‌ఖాన్ ఇంటిని వెదుక్కుంటూ ఒక‌రోజంతా తిరిగింది. ఎలాగోలా స‌బ‌ర్బ‌న్ బాంద్రాలోని స‌ల్మాన్ ఇంటికి చేరుకుంది. అక్క‌డ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఆమెను వెన‌క్కి పంపించేశారు.

దీనితో- రెండు గంట‌ల త‌రువాత ఆ బాలిక మ‌రోసారి సల్మాన్ ఇంటి వ‌ద్ద‌కు చేరుకుని, సెక్యూరిటీ సిబ్బంది క‌న్నుగ‌ప్పి గోడ దూక‌డానికి ప్ర‌య‌త్నించ‌గా మ‌రోసారి అడ్డుకున్నారు. అనంత‌రం బాంద్రా పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే స‌ల్మాన్ ఇంటికి చేరుకున్న బాంద్రా పోలీసులు బాలిక‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఆమె వ‌ద్ద ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా ఆ బాలిక త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం ఇచ్చారు. ప్ర‌స్తుతం ఆమెను డోంగ్రిలోని బాలల వసతి గృహంలో ఉంచామని, తల్లిదండ్రులు ఆమెను తీసుకెళ్లేందుకు ముంబైకు వస్తున్నారని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here