చాలా క‌ల‌లున్నాయి: దిశ‌

ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌నేది సామెత‌. ఈ సామెత శాండ‌ల్ వుడ్ వ‌ర్థ‌మాన తార దిశా పూవ‌య్య విష‌యంలో నిరూపిత‌మైంది. ఇప్ప‌టికే క‌న్న‌డ సినిమాల్లో తానేంటో నిరూపించుకుని టాలీవుడ్ లోకి ఒక‌టే లైఫ్ అంటూ అడుగుపెట్టిందీ బ్యూటీ. తొలుత తల్లిదండ్రుల‌కు ఇష్ట‌మ‌ని సినీ రంగంలోకి అడుగుపెట్టినా ప‌ది సినిమాల‌కు చేరేస‌రికి త‌న గ‌మ్యం న‌ట‌నే అని తేలిపోయిందంటూ, త‌నకున్న క‌ల‌ల‌న్నింటినీ న‌ట‌న నుంచే సాకారం చేసుకోవాల‌నుకుంటున్నాన‌ని. ఇలా ఎన్నో విష‌యాల‌ను తెలుగు సినీబ‌జ్ తో పంచుకుంది. ఆ విశేషాల‌ను ఆమె మాట‌ల్లోనే…

అన్ని పాత్ర‌ల్లో నిరూపించుకోవాలి: ఇప్ప‌టిదాకా నాకు వ‌చ్చిన సినిమాల్లో ఎక్కువ‌గా గ్లామ‌ర్ పాత్ర‌లే వ‌చ్చాయి. కానీ, సాలిగ్రామ‌, పోలీస్ స్టోరీ లాంటి చిత్రాలు నాకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. నాకు చారిత్రాత్మ‌క సినిమాలు, విల‌నీ షేడ్ ఉన్న పాత్ర‌లు వ‌స్తే చేయాల‌నుంది. క‌న్న‌డ ప‌రిశ్ర‌మ నుంచి చాలామంది హీరోయిన్లు తెలుగు సినిమాలు చేశారు. వీరిలో సౌంద‌ర్య నా ఆరాధ‌కురాలు. ఇసుమంతైనా ఎక్స్ పోజింగ్ చేయ‌కుండా, చీర‌క‌ట్టు ద్వారానే ఎంత అందంగా క‌నిపించ‌వ‌చ్చో నిరూపించిన న‌టి ఆమె. ఆమెకు తెలుగు ప‌రిశ్ర‌మే మాతృ ప‌రిశ్ర‌మ అనేంత‌గా గుర్తింపు తెచ్చ‌కుంది. ఆమె తెలుగులో ఎంద‌రినో అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె న‌ట‌నే ఆమె చ‌నిపోయినప్ప‌టికీ తెలుగు అభిమానులు ఆమెను మ‌రిచిపోలేక‌పోతున్నారు. క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో ల‌క్ష్మీ అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆమెలా వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి మెప్పించాల‌నేది నా కోరిక‌.

మ‌హేశ్ తో చిన్న రోల్ అయినా స‌రే…: ఇప్పుడున్న తెలుగు ప‌రిశ్ర‌మ‌లో అంద‌రు హీరోల‌తో న‌టించాల‌నుంది. నాకు మ‌హేశ్ బాబు అంటే చాలా చాలా ఇష్టం. ఆయ‌న సినిమాలో చిన్న పాత్ర వ‌చ్చినా స‌రే ఎగిరి గంతేస్తాను. నా పాత్ర గురించి కూడా ఆలోచించ‌ను. క‌చ్చితంగా ఆ సీన్ పండించాల‌నే ఆలోచిస్తాను. నాకు స‌మంతా అంటే భ‌లే ఇష్టం. కొన్ని కొన్ని యాంగిల్స్ లో నేను సమంతా పోలిక‌ల‌తో క‌నిపిస్తాను అని చెప్తుంటారు. అలా పోల్చ‌డం కూడా నాకు చాలా ఇష్టంగా ఉంటుంది.

వుమెన్ ఓరియంటెడ్ మూవీస్ లో చేయాల‌నుంది: సినిమాల్లో ఎన్ని పాత్ర‌లొచ్చినా మ‌న‌సు పెట్టి చేస్తూంటాను. అయితే నాకు ప్ర‌త్యేకించి వుమెన్ ఓరియంటెడ్ మూవీస్ లో న‌న్ను నేను నిరూపించుకోవాల‌ని కోరిక‌గా ఉంది. చూద్దాం… ఎవ‌రైనా ద‌ర్శ‌కుడు అటువంటి పాత్ర ఇస్తే క‌చ్చితంగా చేస్తాను. అయితే ప్ర‌తి ఇండ‌స్ట్రీలోనూ పోటీ విప‌రీతంగా ఉంది. మంచి నటీమ‌ణులు కూడా ఉన్నారు. నేను కూడా నా కెరీర్ కు సంబంధించి ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నాను.

అమ్మానాన్న‌ల‌కు ఇండ‌స్ట్రీ అంటే ఇష్టం: నాన్న పేరు పూవ‌య్య‌. జె.డి.ఎస్. పార్టీలో ప‌ని చేస్తారు. అమ్మ సుశీల‌. ఫ్యాష‌న్ డిజైన‌ర్. నాన్న‌కు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన స్నేహితులు చాలామంది ఉన్నారు. నేను ఇంట‌ర్మీడియ‌ట్ లో ఉండ‌గా అనుకోకుండా ఒక షూటింగ్ కు వెళ్ళాల్సి వ‌చ్చింది. అక్క‌డ సినిమాలో అతిథి పాత్ర‌కు ప‌దిహేను, ప‌ద‌హారు సంవ‌త్స‌రాలున్న అమ్మాయి అవ‌స‌ర‌మైంది. వారు నాన్న‌ను అడిగారు. అప్ప‌టిదాకా నాకు చ‌దువు త‌ప్ప మ‌రే ప్ర‌పంచ‌మూ తెలియ‌దు. నాన్న‌కు ఇండ‌స్ట్రీ అంటే చాలా ఇష్టం. దానితో న‌న్ను ఆ పాత్ర చేయ‌మ‌ని చెప్పారు. పెద్ద‌గా అవ‌గాహ‌న లేకుండానే ఆ చిన్న పాత్ర‌లో న‌టించేశాను. ఆ త‌రువాత అమ్మకు కూడా ఇండ‌స్ట్రీ అంటే ఇష్టం ఉండ‌టంతో న‌న్ను ఇద్ద‌రూ మ‌రింత ప్రోత్స‌హించారు. దాంతో ఒక‌వైపు ఇంజ‌నీరింగ్ చ‌దువుతూనే మ‌రోవైపు న‌ట‌న‌ను కొన‌సాగించాను. నాకు సంబంధించిన డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌డం అంతా అమ్మ చూసుకుంటూ నాకు ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూస్తోంది.

త‌మిళ్, మ‌ల‌యాళంలో కూడా చేస్తున్నా: ప్ర‌స్తుతం తెలుగులో ఒక‌టే లైఫ్ తో అడుగు పెట్టా. మ‌రో సినిమాకోసం సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఒక‌రు సంప్ర‌దించారు. క‌థ విని ఫైన‌ల్ చేయాల్సి ఉంది. త‌మిళ్ లో ఇప్ప‌టికే ఒక సినిమాను ఒప్పుకున్నాను. మ‌ల‌యాళంలో కూడా సినిమాలు చేసి ద‌క్షిణాది హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాల‌ని ఉంది. క‌థా ప‌రంగా నా క్యారెక్ట‌ర్ న‌చ్చితేనే సినిమా చేస్తాను. ముందుగా ద‌ర్శ‌కుడు న‌న్ను సంప్ర‌దించిన‌ప్పుడు క‌థ వింటాను. క‌థ‌లో నా పాత్ర ఏమిటో తెలుసుకుంటాను. ఏ ప‌రిధుల మేర‌కు హావ భావాలు పండించాలో ద‌ర్శ‌కుడిని అడిగి తెలుసుకుంటాను. ఇవి నా పాత్ర‌లు స‌క్సెస్ అవ‌డానికి తోడ‌వుతున్నాయి. మ‌రోవైపు అమ్మ కూడా నా న‌ట‌న మెరుగు ప‌డేందుకు కొన్ని కొన్ని టిప్స్ చెప్తూనే ఉంటుంది. నా త‌మ్ముడు పి.యు.సి. చేస్తున్నాడు. వాడు నాకు పెద్ద విమ‌ర్శ‌కుడు. ఆ సినిమాలో ఏంటి అలా చేశావ్… ఇంకాస్త బాగా చేయాల్సింది అని చెప్తుంటాడు. నేను హీరోయిన్ అయినందుకు నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు. పూర్తి కుటుంబం నాకు వెన్నుద‌న్నుగా నిలిచి, ప్రోత్సాహ‌మందిస్తోంది. అందుకే నేను హాయిగా సినిమాల్లో రాణించ‌గ‌లుగుతున్నాను. అందుకే తెలుగులోకి అడుగు పెట్ట‌గ‌లిగాను.

ఇండ‌స్ట్రీలో చెడు లేదు: ఏ రంగంలోనైనా మంచీ చెడు అనేవి ఉంటూనే ఉంటాయి. అయితే మ‌నం ఎంచుకునే మార్గం మ‌నం ఏం కావాలనేది నిర్ణ‌యిస్తుంద‌నేది నా న‌మ్మ‌కం. నేను ఒక ప్రొటెక్టెడ్ ఫ్యామిలీలో పెరిగాను. మా కుటుంబం కేవ‌లం అమ్మా నాన్న‌, త‌మ్ముడు మాత్ర‌మే కాదు. అమ్మ‌మ్మ, నాన‌మ్మ‌, బాబాయిలు, పిన్నిలు… ఇలా ఎంద‌రో ఉన్నారు. నాకు ఒక్క‌దాన్నే బ‌య‌ట‌కు వెళ్ళాల్సిన అవ‌స‌రం ఇంత వ‌ర‌కు రాలేదు. షూటింగ్స్ కూడా అమ్మ నాతో వ‌స్తుంటారు. రాజ‌కీయాల్లో ఏ కాస్త ఖాళీ దొరికినా నాన్న, అప్పుడ‌ప్పుడు త‌మ్ముడు… ఇలా ఎవ‌రో ఒక‌రు నాకు తోడుంటారు. తెలుగు ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి విన్నాను. లేటెస్ట్ గా అమెరికా ఉదంతం కూడా బ‌య‌ట‌ప‌డింది. నేను ప‌బ్ క‌ల్చ‌ర్ కు చాలా దూరం. అటువంటి పార్టీలంటేనే నాకు న‌చ్చ‌దు. ఇక స్నేహితుల మ‌ధ్య జ‌రిగే పార్టీల‌నైతే ఎక్కువ‌గా బంధువుల హోట‌ల్ లోనో, మా ఇంట్లోనో, వాళ్ళ ఇళ్ళ‌ల్లోనో… ఇలా అరేంజ్ చేసుకుంటుంటాం. నేనెప్పుడూ జ‌నాల మ‌ధ్య‌నే ఉంటూంటాను. పైగా నాకు అంద‌రూ తోడున్నారు. సో… నాకేమీ భ‌యం అనిపించ‌లేదు.

పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, ప్ర‌యాణాలు చేయ‌డం ఇష్టం: ద‌క్షిణాది చిత్రాలు చేయాల‌నుకోడానికి మ‌రో కార‌ణం కూడా ఉందండి. నాకు ప్ర‌యాణాలంటే భ‌లే ఇష్టం. నేను స్పోర్ట్స్ కూడా బాగా ఆడ‌తాను. వింబుల్డ‌న్ రాష్ట్ర స్థాయిలో ఆడాను. అథ్లెట్స్ అన్నింటిలో ఉన్నాను. కారు డ్రైవింగ్ చేయ‌డం అంటే కూడా ఇష్టం. ఈ మధ్యే నేను రాష్ట్రస్థాయిలో క్రికెట్ ఆడి ఆరు వికెట్లు తీసాను కూడా(న‌వ్వుతూ). రొమాంటిక్ క‌థ‌లు చ‌ద‌వ‌డ‌మంటే చాలా ఇష్టం. సుదీప్ నాగ‌ర్క‌ర్ రాసిన అవ‌ర్ స్టోరీ నీడ్స్ నో ఫిల్ట‌ర్, రాజీవ్ సెల్వ‌రాజ్ రాసిన లీడ్ ఆర్ బ్లీడ్ క‌థ‌లు నాకు చాలా ఇష్ట‌. వుమెన్ మోటివేటెడ్ క‌థ‌లంటే నాకు చాలా ఇష్టం. గౌరీ లంకేష్ క‌థ‌నాల‌ను కూడా బాగా చ‌దివేదాన్ని. ఖాళీగా ఉన్న స‌మ‌యంలో నేను వంట చేస్తుంటాను కూడా. స్పెష‌ల్లీ చిల్లీ చికెన్ నాకు ఇష్ట‌మైన ఐటం. నేను చేసే వంట‌కాల‌న్నింటినీ ఇంట్లో అంద‌రిమీదా ప్ర‌యోగిస్తుంటాను.(న‌వ్వు)

సామాజిక సేవ చేస్తూనే ఉంటా: స‌మ‌కాలీన స‌మ‌స్య‌ల‌పై నా దృష్టి ఎప్పుడూ ఉంటుంది. మా నాన్న రాజ‌కీయ నాయకుడు. పైగా మా సొంత గ్రామం బెంగ‌ళూరుకు 365 కిలో మీట‌ర్ల దూరంలో ఉంది. మ‌డికేరిలో ముక్కోడ్లు మా గ్రామం. ఆ గ్రామంలో ఇక్క‌డ ఒక ఇల్లుంటే మ‌రో కిలో మీట‌ర్ కో, రెండు కిలో మీట‌ర్ల కో ఇంకో ఇల్లు ఉంటుంది. బాగా వెన‌క‌బ‌డి ఉంది. నాన్న‌కు ఎన్నో విన్న‌పాలు వ‌స్తుంటాయి. అక్క‌డ మంచి నీటి వ‌స‌తి కానీ, రోడ్లు కానీ, విద్యుత్ వ్య‌వ‌స్థ కానీ, స్కూల్ కానీ, క‌నీసం ఒక చిన్న టాయ్ లెట్ సౌక‌ర్యం కూడా లేని ప‌రిస్థితి ఉంది. నాన్న సోలార్ లైట్లు వేయించ‌డం, రోడ్లు బాగు చేయించ‌డం, మంచినీటిని అందేలా చేయ‌డం లాంటి వ‌న్నీ చేశారు. అవ‌న్నీ నేను చూస్తూనే ఉన్నాను. నాకు నా స్నేహితులు మీ నాన్న‌తో చెప్పి మా ఊళ్లో ఫ‌లానా స‌మ‌స్య తీర్చ‌మ‌ని చెప్పు అని చెప్తుంటారు. అలా నేను కూడా సామాజిక సేవలో భాగ‌మై పోయాను. భ‌విష్య‌త్తులో చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయి ప‌రిష్క‌రించ‌డానికి.

ఒకటే లైఫ్ సినిమా చూడండి: యువ‌త వ్య‌స‌నాల‌కు బానిస అయిపోతే కుటుంబంపై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతుంద‌నే క‌థాక‌థ‌నంతో సినిమా తీశారు. క‌థంతా నా చుట్టూనే తిరుగుతుంటుంది. ఇంకా చాలా అంశాలు క‌థ‌లో ఉన్నాయి. ద‌ర్శ‌కుడు వెంక‌టేశ్ స‌ర్ నాకు భాష రాక‌పోయినా చాలా బాగా అర్థం చేయించి న‌టింప చేశారు. ఇక హీరోలుగా ఉన్న మ‌హేష్ చౌద‌రి, రిషి పుత్తూరు న‌న్ను చాలా బాగా ఎంక‌రేజ్ చేశారు. క‌చ్చితంగా నా పాత్ర అంద‌రికీ న‌చ్చుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here