జాకీలు పెట్టి ఇంటిని పైకి లేపారు..!

టైర్ మార్చాల్సి వ‌చ్చిన‌ప్పుడు జాకీ పెట్టి వాహ‌నాల‌ను పైకి లేపేస్తుంటాం. ఇక్క‌డ మాత్రం జాకీలు పెట్టి ఏకంగా ఓ ఇంటినే పైకి లేపేశారు. పునాదుల నుంచి అయిద‌డుగుల‌ మేర పైకి లేపారు.

గ‌తంలోనూ ఇలాంటి సంద‌ర్భాలు చోటు చేసుకున్న‌ప్ప‌టికీ.. ఇది కాస్త డిఫ‌రెంట్ అంతే. ఎందుకంటే.. ఆ రాష్ట్రంలో ఇదే మొద‌టిసారి. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని అల్వార్ జిల్లాలో చోటు చేసుకుంది.

అల్వార్ న‌గ‌రంలోని తిజారా ఫాట‌క్ ప్రాంతంలో నివ‌సించే రామ్‌ప్ర‌తాప్ భాటీ ఇల్లు అది. స్థానికంగా ఆయ‌న న‌గ‌ల వ్యాపారి. ఇంటి కంటే రోడ్డు ఎత్తుగా ఉండ‌టం, వ‌ర్ష‌పు నీరు ఇంట్లోకి వ‌స్తుండ‌టంతో భాటీ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఓ బిల్డర్‌ను సంప్ర‌దించారు. దీనితో రంగంలోకి దిగాడా బిల్డ‌ర్‌. 200 జాకీల‌ను తీసుకొచ్చారు. ఇంటి పునాదుల‌తో అనుసంధానించిన పిల్ల‌ర్ల‌ను తొలిచారు. పునాదుల‌కు, పిల్ల‌ర్ల‌కు సంబంధం లేకుండా చేశారు. ఆ త‌రువాత పిల్ల‌ర్ల స్థానంలో జాకీల‌ను ఉంచి.. కొద్దికొద్దిగా పైకి లేపుతూ వ‌చ్చారు.

ఒక్కొక్క జాకీని తొల‌గిస్తూ, దాని స్థానంలో ఇటుక‌ల‌తో గోడ క‌ట్టారు. ఇలా నెల‌రోజుల వ్య‌వధిలో ఇంటి మొత్తాన్నీ అయిద‌డుగుల మేర పైకి లేపారు. ప్ర‌స్తుతం నిర్మాణ ప‌నులు ఇంకా కొనసాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here