భూమికి 700 మీట‌ర్ల‌కు పైగా ఎత్తులో..గాల్లో..అయిదు గంట‌ల భ‌యాన‌క అనుభ‌వం!

ప్ర‌కృతి అందం మొత్తం ఇక్క‌డే ఉందా..అనిపించే ప్రాంతం అది. చుట్టూ హిందూ మ‌హాస‌ముద్రం, మ‌ధ్య‌లో ద‌ట్ట‌మైన అడ‌వులు, ఎత్త‌యిన వృక్షాల‌తో నిండిన ద్వీపం. అదే లంకావి.

మ‌లేసియాలో అద్భుతం అనిపించే ద్వీపం ఇది. ప్రకృతి అందాలను తిల‌కించ‌డానికి పర్యాటకుల కోసం ప్ర‌త్యేకంగా కేబుల్ కార్ అందుబాటులో ఉంటుంది ఇక్క‌డ‌. భూమికి వెయ్యి అడుగుల ఎత్తు నుంచి స‌ముద్రం వైపు జారిపోయే ఆ అనుభవాన్ని వ‌ర్ణించ‌డానికి మాట‌లు చాల‌వు.

అలాంటి కేబుల్ కార్ కొన్ని గంట‌ల పాటు స్తంభించిపోయింది. పర్యాట‌కులు అయిదు గంట‌ల పాటు గాల్లో, కేబుల్ కార్‌లో ఇరుక్కుపోయారు. సుమారు 92 మంది ప‌ర్యాట‌కుల‌కు ఈ భయానక అనుభవం ఎదురైంది.

కేబుల్‌ కార్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో టూరిస్టులు దాదాపు అయిదు గంటల పాటు ఆ కార్లలో చిక్కుకుపోయారు. లంకావికి వ‌చ్చే ప్ర‌తి ప‌ర్యాట‌కుడు కూడా కేబుల్ కార్‌ను ఎక్క‌నిదే వెనక్కి వెళ్ల‌డు. అంత‌టి ప్రాముఖ్య‌త, టూరిస్టుల తాకిడీ ఉందా వ్య‌వ‌స్థ‌కు. వారాంత‌పు రోజులు కావ‌డ‌తో కేబుల్ కార్‌కు ప‌ర్యాట‌కుల ర‌ద్దీ తీవ్రంగా ఉంది.

సాయంత్రం కార్లు రోప్‌ మధ్యలోకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా నిలిచిపోయాయి. కేబుల్‌ కార్‌ సిస్టమ్‌లోని బేరింగ్‌ చెడిపోవడంతో అవి క‌ద‌ల‌కుండా మొరాయించాయి.

సముద్ర మట్టానికి 708 మీటర్ల ఎత్తులో అలా గాల్లో ఉండిపోవాల్సి రావడంతో ప‌ర్యాట‌కులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అక్కడి సిబ్బంది వెంటనే టెక్నీషియన్లను పిలిపించి మరమ్మతులు చేపట్టారు. అయిదు గంటల పాటు మరమ్మతులు చేశారు. రాత్రి 9.30గంటలకు వారిని సురక్షితంగా బేస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here