శశికళ భర్త నటరాజన్ మృతి.. పెరోల్ పై విడుదల..!

శశికళ.. తమిళనాడు రాజకీయాలను శాసించగల మహిళ.. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా రాజకీయాల్లో కీలక భూమికను పోషించింది. జయలలిత మరణం తర్వాత జరిగిన పరిణామాల అనంతరం శశికళ జైలుకు వెళ్ళారు. అయితే ఆమె జీవితంలో ఇప్పుడు మరో బాధాకరమైన ఘటన చోటుచేసుకుంది.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శశికళ భర్త ఎం.నటరాజన్ సోమవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన గత అక్టోబరులో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారు. మార్చి 16న అనారోగ్యంతో చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 1975లో శశికళను వివాహం చేసుకోవడానికి ముందు నటరాజన్ పీఆర్వోగా పనిచేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడు హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. జయలలితకు రాజకీయ సలహాదారుగానూ పనిచేశారు. భర్త నటరాజన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలియడంతో శశికళ సోమవారం పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.. ఇంతలోనే మరణించాడన్న విషయం బయటకు వచ్చింది. కొద్ది గంటల్లో శశికళ బయటకు వచ్చే అవకాశం ఉంది.

కొద్ది నెలల క్రితం కూడా తన భర్తకు ఆరోగ్యం సరిగా లేదని చెప్పి శశికళ పెరోల్ మీద బయటకు వచ్చింది. కానీ భర్త దగ్గర తక్కువ సమయం కేటాయించి.. వేరే విషయాలపై శశికళ దృష్టి సారించిందని విమర్శలు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here