సేల్స్ గ‌ర్ల్ ఉద్యోగం ఇప్పిస్తామ‌ని దుబాయ్ తీసుకెళ్లి.. ఆమెనే సేల్ చేసేశారు!

హైద‌రాబాద్‌: దుబాయ్‌లో సేల్స్ గ‌ర్ల్ ఉద్యోగం ఇప్పిస్తామ‌ని ఓ మ‌హిళ‌ను మోస‌గించిన ఘ‌ట‌న ఇది. దుబాయ్‌లోని ఓ సూప‌ర్‌మార్కెట్‌లో సేల్స్ గ‌ర్ల్ ఉద్యోగం ఉంద‌ని ఏజెంట్లు చెబితే, నిజ‌మేన‌ని న‌మ్మిందామె. ఇక్క‌డి కంటే ఎక్కువ జీతం ఇప్పిస్తామ‌ని ఆశ పెట్ట‌డంతో గుడ్డిగా ఆ ఏజెంట్లు చెప్పిన‌ట్టు దుబాయ్‌కు వెళ్లింది. తీరా అక్క‌డికి వెళ్లాక‌.. ఆమెను ఓ షేక్‌కు అమ్మేశారు ద‌ళారులు.

ఏడాది పాటు ఆమె దుబాయ్‌తో పాటు ప‌లు న‌గ‌రాల్లో షేక్‌ల ఇంట్లో ప‌నిమ‌నిషిగా దుర్భ‌ర జీవితాన్ని అనుభ‌వించారు. చివ‌రికి- విదేశాంగ మంత్రిత్వ‌శాఖ జోక్యం చేసుకోవ‌డంతో సుర‌క్షితంగా హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. రెండురోజుల కింద‌టే హైద‌రాబాద్‌కు వ‌చ్చిన బాధితురాలు.. త‌న చేదు అనుభ‌వాల‌ను పోలీసులు, మీడియాకు వెల్ల‌డించారు.

 

బాధితురాలి పేరు రుక్సానా (పేరుమార్చాం). హైద‌రాబాద్ పాత‌బ‌స్తీకి చెందిన రుక్సానా మార్చి 18వ తేదీన దుబాయ్‌కు తీసుకెళ్లాడో ఏజెంట్‌. అక్క‌డ ఆమెను ఓ ఏజెన్సీకి అప్ప‌గించారు. షేక్ ఇళ్ల‌కు ప‌నిమ‌నుషుల‌ను స‌ర‌ఫ‌రా చేసే ఏజెన్సీ అది. అక్క‌డ న‌రకం చూపించిందా ఏజెన్సీ.

ఆమెను యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లోని షార్జాకు తీసుకెళ్లారు. అక్క‌డ ఓ షేక్‌కు అమ్మేశారు. ఆ షేక్ ఆమెను మొద‌ట బ‌హ్రెయిన్‌, అనంత‌రం ఒమ‌న్‌కు తీసుకెళ్లాడు. ప‌లు ఇళ్ల‌ల్లో ప‌నులు చేయించాడు. స‌రైన ఆహారం పెట్టేవారు కాద‌ని బాధితురాలు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రోజులో 18 గంట‌ల పాటు ప‌నిచేయాల్సి వ‌స్తుండేద‌ని అన్నారు.

ఎలాగోలా ఆమె పాత‌బ‌స్తీలో ఉన్న త‌న త‌ల్లికి ఫోన్ చేయ‌గా.. ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. పోలీసులు విదేశాంగ మంత్రిత్వ‌శాఖ‌ను సంప్ర‌దించారు. ఆ శాఖ అధికారులు మ‌స్క‌ట్‌లోని భార‌త రాయ‌బార కార్యాల‌యానికి స‌మాచారం ఇవ్వ‌గా, వారు ఆమెను ఆదుకున్నారు. దీనితో ఆమె క్షేమంగా మ‌ళ్లీ హైద‌రాబాద్‌కు చేరుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here