పెంపుడు కుక్కను చంపిన కన్నకొడుకుపై తండ్రి కేసు.. కుక్క మృతదేహాన్ని తీసుకొని వెళ్ళి మరీ..!

కొందరు జంతువులను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. అలాగే ఎంతో ప్రేమగా సొంత బిడ్డలా చూసుకుంటూ ఉంటారు. అలాంటి పెంపుడు కుక్కను కన్న కొడుకే చంపేస్తే..! ఆ తండ్రి ఊరికే ఉండలేదు.. కుక్క మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్ళి.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కన్నకొడుకు అయినా కఠిన శిక్షను విధించాలని కోరారు.

ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని సూరజ్‌పూర్‌లో చోటుచేసుకుంది. శివమంగళ్ సాయి తన కుక్క మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌ కు సైకిల్‌పై తీసుకుని వెళ్ళి మరీ తన కొడుకుపై కేసు పెట్టాడు. ఏడాదికాలంగా పెంచుకుంటున్న కుక్కపై తాను ఇంట్లో లేని సమయంలో తన కొడుకు కత్తితో దాడి చేసి చంపేశాడని శివమంగళ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక జంతువు పట్ల క్రూరంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 429 (ఎనిమల్ యాక్ట్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భాట్‌గావ్ ఎస్‌ఐ దీపక్‌సాహి తెలిపారు.

బుధవారం నాడు శివమంగళ్ ఏదో పని మీద బయటకు వెళ్ళాడు. ఆ సమయంలో అతడి కుక్క ఇంట్లోనే ఉంది. కొడుకు సంత్ ధారి కూడా ఇంట్లోనే ఉన్నాడు. సంత్ ధారి కుక్కకు బంతిని విసిరి దాన్ని తీసుకొని రమ్మని అడిగాడు. అయితే అది తీసుకొని రాలేదు. దీంతో కోపం తెచ్చుకున్న సంత్ ధారి కుక్కను పదునైన కత్తితో నరికి చంపేశాడు. అతడి తండ్రి తిరిగొచ్చాక చూస్తే కుక్క చనిపోయి కనిపించింది. కుక్కను తన సైకిల్ పై మోసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్ళి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here