జోగ్ జ‌ల‌పాతాన్ని ఎక్క‌బోయి..జారిప‌డ్డ `కోతి`రాజు! రాత్రంతా కొండ‌ల‌ మ‌ధ్య, స్పృహ‌లేకుండా!

శివ‌మొగ్గ: ఎలాంటి ఆధారాలు లేకుండా, చేతుల‌కు పౌడ‌ర్ మాత్ర‌మే పూసుకుని కొండ‌లు, గుట్ట‌లు, జ‌ల‌పాతాలు, కోట‌గోడ‌ల‌ను అవ‌లీల‌గా ఎక్కేసే జ్యోతిరాజ్ ఆలియాస్ కోతిరాజ్ హ‌ఠాత్తుగా వార్త‌ల్లోకి ఎక్కారు.

ఓ ర‌కంగా చెప్పాలంటే ఆయ‌న ప్ర‌మాదానికి గురయ్యారు. ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. పోలీసులు స‌కాలంలో ఆయ‌న‌ను గుర్తించి, కాపాడ‌గ‌లిగారు. క‌ర్ణాట‌క‌లోని చిత్ర‌దుర్గ జిల్లాకు చెందిన జ్యోతిరాజు ప్ర‌మాదానికి గుర‌య్యారు.

ఎత్త‌యిన జ‌ల‌పాతాల్లో ఒక్క‌టైన జోగ్ వాట‌ర్‌ఫాల్‌ను ఎక్క‌డానికి ప్ర‌య‌త్నించిన ఆయ‌న జారి ప‌డ్డారు. 860 అడుగుల ఎత్తు నుంచి హోరుమంటూ శ‌బ్దం చేస్తుకుంటూ జారి ప‌డుతున్న జ‌లపాతాన్ని ఏట‌వాలుగా ఎక్క‌డానికి ప్ర‌య‌త్నించారు.

3 గంట‌ల నుంచి క‌నిపించ‌కుండా పోయారు. ఈ స‌మాచారం అందుకున్న వెంట‌న పోలీసులు జ్యోతిరాజు కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. జోగ్ జ‌ల‌పాతంతో పాటు చుట్టు ప‌క్క‌ల గ‌జ ఈత గాళ్ల‌తో గాలించారు. అయిన‌ప్ప‌టికీ.. ఫ‌లితం లేకుండా పోయింది.

బుధ‌వారం తెల్ల‌వారు జామున 6 గంట‌ల నుంచి డ్రోన్ల స‌హాయంతో గాలించ‌గా.. గుట్ట‌ల్లో చిక్కుకుపోయి, స్పృహ లేని స్థితిలో క‌నిపించారు. డ్రోన్లకు అమ‌ర్చిన కెమెరాల ద్వారా ఆయ‌న‌ను గుర్తించిన పోలీసులు సుర‌క్షితంగా బ‌య‌టికి తీసుకొచ్చారు.

సాగ‌ర్‌, సిద్ధాపుర పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది 16 గంట‌ల పాటు ఆయ‌న కోసం అన్వేషించారు. ఈ ఉద‌యం 8 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న‌ను గుర్తించారు. రాత్రంతా స్పృహ లేని స్థితిలో ఉన్నాన‌ని జ్యోతిరాజ్ చెప్పారు.

ప్రాణాల‌తో తిరిగి వ‌స్తాన‌ని అనుకోలేద‌ని చెప్పారు. త‌న‌ను కాపాడిన పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న సాహ‌స‌కృత్యాల‌ను కొన‌సాగిస్తాన‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here