టీ20ల్లో ఫాస్టెస్ట్ 50! ఎన్ని బంతుల్లోనంటే!

చండీగ‌ఢ్‌: ఐపీఎల్ అంటే అదే మ‌రి. మ‌జా అంటే అదే. రెండంటే రెండు ఓవ‌ర్ల‌లో ఫ‌లితాన్ని తారుమారు చేసి, ఓట‌మి కోర‌ల్లో ఉన్న త‌న జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఆల్‌రౌండ‌ర్ డ్వేన్ బ్రేవో. ఆ విధ్వంసం ముగిసి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క ముందే మ‌రో ప‌రుగుల సునామీ చండీగ‌ఢ్ స్టేడియాన్ని ముంచెత్తింది. ఆ సునామీ పేరు కేఎల్ రాహుల్‌.

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జ‌ట్టు ఓపెన‌ర్‌. టీ20ల్లో హేమాహేమీల‌కు సాధ్యం కాని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పొట్టి ఫార్మ‌ట్‌లో ఫాస్టెస్ట్ 50ని అందుకున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జ‌ట్టు విసిరిన 167 పరుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో రాహుల్ 14 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌తో 51 ప‌రుగులు చేశాడు.

ట్రెంట్ బౌల్ట్ విసిర‌న తొలి ఓవ‌ర్‌లోనే చివ‌రి మూడు బంతుల్లో 16 ప‌రుగులు చేసిన కేఎల్ రాహుల్.. ఇక వెన‌క్కి తిరిగి చూడలేదు. నాలుగో బంతిని సిక్స్‌గా మ‌లిచిన రాహుల్ అయిదు, ఆరు బంతులను బౌండ‌రీల‌ను దాటించాడు.

మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ వేసిన రెండో ఓవ‌ర్‌లో ఓ సిక్స్‌, ఓ ఫోర్ బాదాడు. ఇక అమిత్ మిశ్రా వేసిన మూడో ఓవ‌ర్‌లో విశ్వ‌రూపాన్ని చూపాడు. ఆ ఓవ‌ర్‌లో 4,6,6,4,4 సాధించాడు. దీనితో 14 బంతుల్లోనే 51 ప‌రుగులు చేసిన తొలి క్రికెట‌ర్‌గా రికార్డు నెల‌కొల్పాడు. అయిదో ఓవ‌ర్‌లో బౌల్ట్ వేసిన బాల్‌ను భారీ షాట్ ఆడ‌బోయి ష‌మీ చేతికి చిక్కాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here