`దేశానికి నా నాయ‌క‌త్వం అవ‌స‌రం ఉంద‌నుకుంటే.. జాతీయ రాజ‌కీయాల్లోకి వ‌స్తా`

-థ‌ర్డ్ ఫ్రంట్‌కు కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌హిస్తారా?
-బీజేపీ, కాంగ్రెసేత‌ర పార్టీల‌ను కూడ‌గ‌డ‌తారా?
-దేశ రాజ‌కీయాల్లో స‌మూల మార్పు తీసుకొస్తారా?
-మార్పు కోసం ఎవ‌రితో మాట్లాడాలో వారితోనే మాట్లాడుతున్నానంటోన్న కేసీఆర్‌
హైద‌రాబాద్‌: `దేశానికి నా నాయ‌క‌త్వ అవ‌స‌రం ఉంది అని అనుకుంటే త‌ప్ప‌కుండా జాతీయ రాజ‌కీయాల్లోకి వ‌స్తా..`అంటూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు చేసిన ఓ ప్ర‌క‌ట‌న చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏను, ఇంకో వైపు బీజేపీ నాయ‌క‌త్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఆయ‌న ఏకి పారేశారు.

దీన్ని బ‌ట్టి చూస్తే.. థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా కేసీఆర్ ఆలోచ‌న‌లు సాగుతున్న‌ట్ట‌నిపిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందంటూ ఆయ‌న త‌నదైన శైలిలో చెప్ప‌డం.. అనేక ఊహ‌ల‌కు తావిచ్చిన‌ట్ట‌యింది.

కాంగ్రెస్‌, బీజేపీల‌కు స‌మాంత‌ర దూరాన్ని పాటిస్తూనే..ఆ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా థ‌ర్డ్ ఫ్రంట్‌కు ఊపిరి పోసే దిశ‌గా కేసీఆర్ అడుగులు వేస్తున్నారా? అనే సందేహాలను లేవ‌నెత్తింది. టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ భేటీలో కేసీఆర్.. కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఎవ‌ర్నీ దేబిరించాల్సిన అవ‌స‌రం లేద‌ని, కేంద్రం ఇచ్చే నిధులు ఎవ‌డ‌బ్బ సొమ్మూ కాద‌ని ఆయ‌న నిర్మొహ‌మాటంగా చెప్పారు. రాష్ట్ర హ‌క్కుగా గుర్తించాల‌ని కేంద్రానికి సూచించారు. పార్ల‌మెంట‌రీ పార్టీ భేటీ ముగిసిన త‌రువాత కేసీఆర్ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేన‌ని, పథకాల పేరు మార్చడం మినహా ఆ పార్టీలు ఏమి చేశాయ‌ని ప్ర‌శ్నించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేన‌ని గ‌ళ‌మెత్తారు. దేశ‌ రాజకీయాల్లో మార్పు కోసం కొత్త ప్రయాత్నాలు జరుగుతున్నాయ‌న్న కేసీఆర్‌.. కొత్త సందేహాల‌కు తెర లేపారు.

ఇప్పుడున్న వ్య‌వ‌స్థ‌లు, రాజ‌కీయాల‌ను మార్చాల్సిన అవస‌రం వ‌స్తే.. తాను త‌ప్ప‌కుండా నాయ‌క‌త్వం వ‌హిస్తాన‌ని, ముందుండి న‌డిపిస్తాన‌ని అన్నారు. దేశ రాజ‌కీయాల్లో స‌మూల మార్పును తీసుకుని రావ‌డానికి ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడుతున్నట్లు చెప్పారు.

థర్డ్ ఫ్రంట్ కావొచ్చు, మరో ఫ్రంట్ కావొచ్చు, కేంద్రంలో గుణాత్మకమైన మార్పు రావాలని చెప్పారు. దేశ రాజ‌కీయాల్లో మార్పును తీసుకుని రావ‌డానికి ఎవ‌రితో మాట్లాడాలో.. వారితోనే మాట్లాడుతున్నానంటూ కేసీఆర్ ఇచ్చిన ఓ చిన్న హింట్.. థ‌ర్డ్ ఫ్రంట్ ఖాయ‌మ‌నే సందేశాన్ని ఇచ్చిన‌ట్ట‌యింది.

కాంగ్రెసేతర, బీజేపీయేతర రాజకీయ పార్టీలు చాలానే ఉన్నాయి. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐ వంటి తొమ్మిది వామ‌ప‌క్ష పార్టీలు, త‌మిళ‌నాడులో డీఎంకె, అన్నా డీఎంకె, ప‌శ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో స‌మాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, క‌ర్ణాట‌క‌లో జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌), బిహార్‌లో ఆర్జేడీ, ఒడిశాలో బిజూ జ‌న‌తాద‌ళ్.. ఇవ‌న్నీ బీజేపీ, కాంగ్రెసేత‌రాలే. వాట‌న్నింటినీ కూడ‌గ‌ట్టుకుని నాయ‌క‌త్వం వ‌హించ‌గ‌లిగే అవ‌కాశాలు లేక‌పోలేదు.

త‌మిళ‌నాడులో న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ నేతృత్వంలో కొత్త‌గా ఏర్పాటైన మ‌క్క‌ళ్ నీథి మ‌య్యం పార్టీ కూడా థ‌ర్డ్ ఫ్రంట్‌తో జ‌ట్టు క‌ట్టొచ్చు. ఎందుకంటే.. ఇప్ప‌టికే తాను బీజేపీకి బ‌ద్ధ వ్య‌తిరేకిన‌ని క‌మ‌ల్ హాస‌న్ ప‌లుమార్లు స్ప‌ష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here