హ్యాట్సాఫ్‌..ఇస్రో: తిరుగులేదంతే!

నెల్లూరు: వ‌రుస ప్ర‌యోగాలు.. అన్నీ విజ‌యాలే. ఏ ఒక్క దాంట్లోనూ చెప్పుకోద‌గ్గ వైఫ‌ల్యం క‌నిపించ‌లేదు. ప్ర‌పంచ దేశాలు సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోందీ మ‌న ఇస్రో. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌థావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి తాజాగా ప్ర‌యోగించిన‌ జీఎస్‌ఎల్‌వీ ఎఫ్ 8 కూడా విజయవంతమైంది.

అధునాతన ఉపగ్రహం జీశాట్ 6ఏను జీఎస్‌ఎల్‌వీ ఎఫ్ 8 వాహక నౌక ద్వారా శాస్త్రవేత్తలు గురువారం సాయంత్రం 4.56 గంటలకు అంత‌రిక్షంలోకి ప్ర‌యోగించారు. 17 నిమిషాల 46 సెకెన్ల పాటు ప్ర‌యాణం సాగించిన ఈ ఉప‌గ్ర‌హ వాహక నౌక జీ శాట్‌ను నిర్దేశిత క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టింది.

మూడు దశల్లోనూ జీఎస్‌ఎల్వీ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. స్పాట్‌ బీమ్స్‌లలో ఎస- బ్యాండ్‌, ఒక బీమ్‌లో సి-బ్యాండ్‌ను కలిగి ఉండ‌టం దీని ప్ర‌త్యేక‌త‌. ఉపగ్రహంలో కమ్యూనికేషన్ల లింకేజీ కోసం ఆరు మీటర్ల వ్యాసం కలిగిన యాంటెన్నా’, హబ్‌ కమ్యూనికేషన్‌ లింక్‌ కోసం 0.8 మీటర్ల స్థిర యాంటెన్నాల‌ను అమ‌ర్చారు.

మొబైల్‌ కమ్యూనికేషన్లు సాగించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు అభివృద్ధి చేసిన రాకెట్లలో రెండో అతి పెద్దది. ఆ శ్రేణి రాకెట్‌ను ప్రయోగించడం ఇది 12వ సారి.

ఈ వాహకనౌకలో దేశీయ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ఉంటుంది. స్వదేశీ క్రయో ఇంజిన్‌తో ప్రయోగాన్ని చేపట్టడం ఇది ఆరోసారి. 2014 జనవరి తర్వాత వరుసగా నాలుగు సార్లు ఈ రాకెట్‌ ప్రయోగాలు విజయవంతమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here