మంచి బిల్డింగ్ ఫోటో కనిపిస్తే చంద్రబాబు డౌన్‌లోడ్ చేసేస్తారన్న జగన్.. ఎందుకంటే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ మరోసారి విమర్శలు గుప్పించారు. మంచి బిల్డింగ్ ఫొటో ఇంటర్నెట్‌లో ఎక్కడైనా కనిపిస్తే చంద్రబాబు నాయుడు దాన్ని వెంట‌నే డౌన్‌లోడ్ చేసేస్తారని, ఆ త‌రువాత ఆ ఫొటోను పత్రిక‌ల్లో వేయించుకుని అలా రాజ‌ధాని ఉంటుంద‌ని అంటార‌ని జ‌గ‌న్ అన్నారు. రాజ‌ధాని క‌డుతున్నాన‌ని ఎన్నో మాట‌లు చెబుతూ ఇప్ప‌టికీ ఒక్క శాశ్వ‌త బిల్డింగ్ నిర్మాణం కూడా చేయ‌లేద‌ని చెప్పారు. త‌న రాష్ట్ర ప్ర‌జ‌లు బాగుండాలని ఏ సీఎం అయినా ఆలోచిస్తారని.. కానీ, చంద్ర‌బాబు మాత్రం రాజ‌ధాని ప్రాంతంలో త‌న బినామీల‌తో భూముల‌ను కొనుగోలు చేయిస్తున్నారని ఆరోపించారు. రాజ‌ధాని ఆకృతులంటూ ఓ సారి చంద్ర‌బాబు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని తీసుకొస్తారని, మ‌రోసారి మ‌రొక‌రిని తీసుకొస్తార‌ని, చివరకు రాజధాని నిర్మాణం మాత్రం చేయడం లేదని అన్నారు.

నాలుగేళ్లుగా అన్యాయం చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని రాజధాని నిర్మాణానికి, అభివృద్ధికి వ్యతిరేకులుగా చిత్రీక‌రిస్తూ ఎదురుదాడి చేస్తున్నారని చెప్పారు. నాలుగేళ్లుగా చంద్రబాబు చేయని మాయ, మోసం, చెప్పని అసత్యం లేదని విమ‌ర్శించారు. రాజధాని పేరు చెప్పి చంద్ర‌బాబు చాలా సార్లు విదేశాలకు వెళ్లారని, ఓ సారి జ‌పాన్, మ‌రోసారి అమెరికా, టర్కీ, సింగ‌పూర్ ఇలా వెళుతుంటార‌ని, రాజ‌ధాని ఆకృతులు, నిర్మాణం అంటూ ఎన్నో మాట‌లు చెబుతుంటార‌ని జగన్ అన్నారు. ప్రజలను ఈ విధంగా మభ్య పెడుతున్నార‌ని, తాత్కాలిక సెక్ర‌టేరియ‌ట్, అసెంబ్లీ ఇలా అన్ని తాత్కాలిక నిర్మాణాలే చేశారని, అస‌లు రాజ‌ధాని క‌ట్టే ఉద్దేశం చంద్ర‌బాబుకి ఉందా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఈ రోజు గుంటూరు జిల్లా తాడికొండ నియోజ‌క వ‌ర్గం పేరే చెర్ల‌ ర్యాలీలో జగన్ మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here