వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు

రాజకీయ నేతల బయోపిక్ అనగానే జనాల్లో ఒకరకమైన నిరాసక్తత ఉంటుంది. ఇలాంటివి చాలా వరకు భజన టైపులోనే ఉంటాయి. చిన్న స్థాయిలో మొక్కుబడిగా సినిమాలు తీసేస్తుంటారు. మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గురించి వార్తలొచ్చినపుడు ఇది కూడా అదే టైపు అనుకున్నారు. కానీ ‘ఆనందో బ్రహ్మ’ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్న మహి.వి.రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడన్నాక జనాల్లో సీరియస్నెస్ వచ్చింది. ఇక మలయాళ లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ఇందులో వైఎస్ పాత్ర చేస్తున్నాడన్నాక జనాల్లో ఒక్కసారిగా ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక ఈ చిత్రంలో ఇతర పాత్రలకు వినిపిస్తున్న పేర్లు చూస్తే క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది.

‘యాత్ర’లో రావు రమేష్.. పోసాని కృష్ణమురళి.. అనసూయ లాంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఒక క్రేజీ ఆర్టిస్టును ఈ సినిమా కోసం తీసుకున్నారు. ఆయన మరెవరో కాదు.. జగపతిబాబు. వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నాడట. ఫ్యాక్షనిస్టుగా గుర్తింపున్న రాజా రెడ్డి గురించి పులివెందులలో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆయనలో మంచి-చెడు కోణాలు రెండూ ఉన్నాయి. ఐతే తన కంటే వయసులో పెద్ద అయిన మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటిస్తుంటే.. జగపతిబాబు రాజారెడ్డి క్యారెక్టర్లో కనిపించబోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే పోలికల విషయంలో జగపతిబాబు రాజారెడ్డి పాత్రకు బాగానే సూటవుతాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆ పాత్రలో జగపతి ఎలా మెప్పిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here