కాశ్మీరు కొండ‌ల్లో రాజ‌కీయ మంట‌లు! ప‌ద‌వికి రాజీనామా చేసిన ముఖ్య‌మంత్రి

జ‌మ్మూ కాశ్మీర్ ముఖ్య‌మంత్రి, పీపుల్స్ డెమోక్ర‌టిక్ పార్టీ అధినేత్రి మెహ‌బూబా ముఫ్తీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న రాజీనామా ప‌త్రాన్ని గ‌వ‌ర్న‌ర్ న‌రేంద్ర‌నాథ్‌కు అప్ప‌గించారు. బీజేపీతో ఉన్న పొత్తు కార‌ణంగా ఆమె రెండున్న‌ర సంవ‌త్స‌రాల ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఆ పార్టీకి అప్ప‌గించాల్సి ఉంది.

జ‌మ్మూ కాశ్మీర్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్ప‌డిన కార‌ణంగా బీజేపీ-పీడీపీ పొత్తు పెట్టుకుని అధికారాన్ని ఏర్పాటు చేశాయి. అయిదేళ్ల ముఖ్య‌మంత్రి ప‌ద‌విని రెండు పార్టీలూ స‌మానంగా పంచుకోవాల్సి ఉంటుంద‌నే ష‌ర‌తు మీద పొత్తు ఏర్ప‌డింది. మొద‌ట్లో మెహ‌బూబా ముఫ్తీ తండ్రి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అధిష్టించారు. ప‌ద‌విలో ఉండ‌గానే ఆయ‌న క‌న్నుమూశారు.

దీనితో ఆయ‌న కుమార్తె ముఖ్య‌మంత్రి ప‌గ్గాల‌ను అందుకున్నారు. రెండున్న‌రేళ్ల కాలం ముగిసినందున‌.. ష‌ర‌తుల ప్ర‌కారం ఆమె త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆమె స్థానంలో బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు జ‌మ్మూ కాశ్మీర్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌ల‌ను అందుకుంటారు. ఆ నాయ‌కుడెవ‌ర‌నేది ఇంకా తేలాల్సి ఉంది.

బీజేపీకి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అంద‌కుండా చేయ‌డానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. పీడీపీకి తాము బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇస్తామ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు గులాం న‌బీ ఆజాద్ ప్ర‌క‌టించారు. 89 మంది స‌భ్యుల బ‌లం ఉన్న జ‌మ్మూ కాశ్మీర్‌లో పీడీపీ-28, బీజేపీ-25, జేఅండ్‌కే నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌-15, కాంగ్రెస్‌-12 స్థానాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here