ఎయిర్ హోస్టెస్ కూడా స్మ‌గ్లింగ్ చేస్తే ఎట్టా!

ఇప్ప‌టిదాకా స్మ‌గ్లింగ్ అనేది వివిధ రూపాల్లో క‌నిపించింది. ఇప్పుడు క‌నిపించిన రూపం మాత్రం గ‌తంలో ఎప్పుడూ చూడ‌నిది. ఈ సారి స్మ‌గ్లింగ్ కోసం ఏకంగా ఎయిర్ హోస్టెస్‌నే బుట్ట‌లో వేసుకున్నారు స్మ‌గ్ల‌ర్లు.

ఎయిర్ హోస్టెస్ ద్వారా న‌గ‌దు, వ‌స్తువుల‌ను అక్ర‌మంగా త‌ర‌లిస్తే.. ఎవ‌రూ త‌నిఖీ చేయ‌ర‌నే ఉద్దేశంతో వారు ఈ ప‌నికి పూనుకున్నారు.

అక్రమంగా 3.5 కోట్ల రూపాయ‌ల విలువ చేసే అమెరికా డాలర్లను తీసుకొస్తున్న ఎయిర్ హోస్టెస్‌ను ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

హాంగ్‌కాంగ్ నుంచి ఢిల్లీకి వ‌చ్చిన జెట్ ఎయిర్‌వేస్ విమానం అది. సోమవారం రాత్రి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.

డీఆర్‌ఐ అధికారులు ఆ సమయంలో తనిఖీ చేయగా ఎయిర్‌హోస్టెస్ సిబ్బందిలో ఒకరి వద్ద ఉన్న సూట్‌కేస్‌లో 3.50 కోట్ల రూపాయ‌ల విలువ ఉన్న అమెరికన్‌ డాలర్లు లభించాయి.

దీంతో ఆమెను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అదంతా బ్లాక్‌మ‌నీ అట. బ్లాక్ మ‌నీని విదేశాలకు తరలించి బంగారంతో స్వదేశానికి తీసుకొచ్చే ముఠాకు ఈ ఎయిర్ హోస్టెస్ సహకరిస్తున్నట్టు అధికారుల ద‌ర్యాప్తులో తేలింది.

అమిత్ అనే వ్యక్తి సదరు ఎయిర్ హోస్టెస్‌తో పరిచయం పెంచుకుని డబ్బు తరలించేందుకు ఒప్పించాడు.

ఇలా దొంగచాటుగా ఎంత డబ్బు తరలిస్తే అందులో ఒకశాతం ఆమెకు కమిషన్‌గా ఇచ్చేవాడనీ… దాదాపు రెండు నెలల నుంచి 10 లక్షల డాలర్ల సొమ్మును ఆమె తరలించినట్టు డీఆర్ఐ వర్గాలు వెల్లడించాయి.

ఎయిర్‌పోర్టులోని స్కానర్లు పసిగట్టకుండా ఉండేందుకు ఫాయిల్ పేపర్లో డబ్బుకట్టలు చుట్టి తీసుకెళ్లినట్టు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here