రైలు టాయ్‌లెట్‌లో మూడురోజులు మ‌గ్గిన మృత‌దేహం! మూడు రాష్ట్రాలు దాటింది!

పాట్నా-కోటా మ‌ధ్య న‌డిచే ఎక్స్‌ప్రెస్ రైలు అది. ఆ రైలు ఏసీ 3-ట‌య‌ర్ బోగీ టాయ్‌లెట్‌లో ఓ వ్య‌క్తి మృత‌దేహం. మూడురోజుల పాటు ఆ బోగీని, ఆ టాయ్‌లెట్‌ను ఎవ‌రూ పట్టించుకోలేదు. 72 గంట‌ల పాటు 1500 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించింది కూడా. అయిన‌ప్ప‌టికీ.. తోటి ప్ర‌యాణికులు కూడా టాయ్‌లెట్‌లో మృత‌దేహం ఉన్న‌ట్టు గుర్తించ‌లేకపోయారు.

మృతుడిని ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌గా గుర్తించారు. ఆగ్రాలో ఓ పెళ్లికి హాజ‌రు కావ‌డానికి సంజ‌య్‌కుమార్ ఈ నెల 24వ తేద‌న ఉదయం 6 గంటలకు పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఏసీ-3 ట‌య‌ర్ బోగీలో కూర్చున్నారు. అత‌నికి గుండెపోటు ఉంది. దీనికోసం మాత్ర‌లు వాడుతుండేవాడు.

సంజ‌య్‌కుమార్ రైలు ఎక్కిన రెండు గంట‌ల త‌రువాత ఆయ‌న భార్య ఫోన్ చేశారు. అదే ఆమెకు చివ‌రి ఫోన్‌కాల్‌. ఆ త‌రువాత ఎన్నిసార్లు ఫోన్ చేసిన‌ప్ప‌టికీ.. సంజ‌య్‌కుమార్ ఫోన్ స్విచాఫ్ వ‌చ్చింది. బంధువులకు ఫోన్ చేయ‌గా.. ఆయ‌న ఆగ్రాకు రాలేద‌ని, పెళ్లికి హాజ‌రు కాలేద‌ని తెలిపారు. దీనితో బెంబేలెత్తిన సంజయ్ కుమార్ భార్య రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్ లిస్ట్ తీయ‌గా.. చివ‌ర‌గా సంజ‌య్‌కుమార్ చివ‌రి సారిగా త‌న భార్య‌తో మాట్లాడిన‌ట్టు తేలింది.

ఆ తరువాత ద‌ర్యాప్తు పెద్ద‌గా ముందుకు సాగ‌లేదు. దీనితో సంజ‌య్‌కుమార్‌ను గుర్తించ‌డంలో జాప్యం చోటు చేసుకుంది. ఇదిలావుండ‌గా బీహార్ రాజ‌ధాని పాట్నా నుంచి రాజ‌స్థాన్‌లోని కోటా మ‌ధ్య దూరం సుమారు 1100 కిలోమీట‌ర్లు. సుమారు 18 గంట‌ల ప్ర‌యాణ కాలం. పాట్నా నుంచి బ‌య‌లుదేరిన ఈ రైలు కోటాకు చేరుకుంది. అక్క‌డ కూడా రైలు టాయ్‌లెట్‌లో మృత‌దేహం ఉంద‌నే విష‌యాన్ని ఎవ‌రూ గుర్తించ‌లేక‌పోయారు.

ఆ త‌రువాత అదే రైలు మ‌ళ్లీ కోటా నుంచి పాట్నాకు వ‌చ్చింది. రైలును యార్డ్‌కు త‌ర‌లించి, అప్పుడు శుభ్రం చేసే ప‌ని చేప‌ట్టారు రైల్వే కార్మికులు. అప్ప‌టికే మూడు రోజులు గ‌డిచిపోయాయి. శుభ్రం చేస్తున్న స‌మ‌యంలో ఏసీ-3 ట‌య‌ర్ బోగీ టాయ్‌లెట్ నుంచి దుర్వాస‌న వ‌స్తోన్న విష‌యాన్ని గుర్తించిన రైల్వే కార్మికులు అధికారుల‌కు తెలియ‌జేశారు. దీనితో వారు టాయ్‌లెట్‌ను తెరిచి చూడ‌గా.. అందులో సంజ‌య్‌కుమార్ మృత‌దేహం క‌నిపించింది.

ఐడీ కార్డు ఆధారంగా అత‌ణ్ని గుర్తించారు. కాన్పూర్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. చివ‌రిసారిగా సంజ‌య్‌కుమార్ భార్యతో ఫోన్‌ మాట్లాడిన అనంతరం బాత్రూమ్‌కి వెళ్లగా అక్కడే గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయి మరణించారు. లోపలి నుంచి బాత్రూం గడియ పెట్టుకుని ఉండడంతో ఎవ్వరూ గమనించలేదని రైల్వే పోలీస్‌ విభాగం దర్యాప్తు అధికారి వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here