కాంగ్రెస్‌-జేడీఎస్ పొత్తు! కుమార‌స్వామికి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి

-మేజిక్ ఫిగ‌ర్ ముంగిట చ‌తికిల‌ప‌డ్డ క‌మ‌ల‌నాథులు
-సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ
-కాంగ్రెస్‌-బీజేపీ క‌లిస్తే ప్ర‌భుత్వ ఏర్పాటు సాధ్యం
-దేవేగౌడ‌కు సోనియాగాంధీ ఫోన్‌
-కుమారస్వామికి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఓకే

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్‌.. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌పించింది. కౌంటింగ్ ఆరంభంలో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తరువాత చ‌తికిల ప‌డింది. రెండోస్థానంలో కొన‌సాగిన క‌మ‌ల‌నాథులు రేసులోకి వ‌చ్చారు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన 112 సీట్ల మేజిక్ ఫిగ‌ర్‌ను దాటి ఓ ఏడెనిమిది స్థానాలు ముందుకెళ్లారు.

దీనితో బీజేపీ స్ప‌ష్ట‌మైన మెజారిటీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని అనుకున్నారంతా. స‌మ‌యం గ‌డిచే స‌రికి ఆ ఆశ‌లు ఆవిర‌వుతూ వ‌చ్చాయి. 118 స్థానాల్లో ఆధిక్యాన్ని క‌న‌ప‌రిచిన బీజేపీ.. ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. 104 స్థానాల‌కు ప‌రిమిత‌మైంది. అక్క‌డి నుంచి పైకి ఎగ‌బాకడం దాదాపు అసాధ్యం.

కౌంటింగ్ చివ‌రి ద‌శ‌లో వ‌చ్చిన ప‌రిస్థితుల్లో బీజేపీ మ‌ళ్లీ పుంజుకుని మేజిక్ ఫిగ‌ర్‌ను అందుకుంటుంద‌ని ఆశించ‌డం అత్యాశే అవుతుంది. ఎప్పుడైతే బీజేపీ సంఖ్య క్షీణించిందో.. అటు కాంగ్రెస్‌, ఇటు జేడీఎస్‌ల సీట్ల సంఖ్య పెరిగింది. ఈ రెండు పార్టీలు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన సీట్ల సంఖ్య‌ను అందుకున్నాయి.

దీనితో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవ‌డం లాంఛ‌న‌మే అయింది. దీనికోసం జేడీఎస్ అధినేత, మాజీ ప్ర‌ధాని దేవెగౌడ కుమారుడు, మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామికి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది కూడా. సోనియాగాంధీ రంగంలోకి దిగారు. బెంగ‌ళూరులో ఉన్న దేవెగౌడ‌కు ఫోన్ చేశారు.

దేవెగౌడ సూచించిన వ్య‌క్తికి ముఖ్య‌మంత్రిని చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇదే విష‌యాన్ని మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య కూడా వెల్ల‌డించారు. త‌న నివాసంలో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. కాంగ్రెస్ 78 స్థానాల్లో, జేడీఎస్ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు క‌లిస్తే 112 సీట్ల మేజిక్ ఫిగ‌ర్‌ను అందుకుంటాయి.

దీనితో తాము జేడీఎస్‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. కౌంటింగ్ చివ‌రిద‌శ‌లో ఉన్న నేప‌థ్యంలో ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప బీజేపీ మేజిక్ ఫిగ‌ర్‌ను అందుకోవ‌డం దాదాపు అసాధ్యం. ఒక స్థానంలో విజ‌యం సాధించిన బీఎస్పీ కూడా కాంగ్రెస్‌, జేడీఎస్‌ల కూట‌మికే మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here