భార్య‌ను చంపి..అడ‌విలో మృత‌దేహాంపై పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టి..

కుటుంబ కలహాలతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు క‌ట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో భర్త చంద్రకాంత్, అతని స్నేహితుడు రాజ్‌వీర్‌సింగ్‌ను శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటు చేసుకుంది. మృతురాలి పేరు అక్షత‌. చంద్ర‌కాంత్ అనే వ్య‌క్తిని ఆమె ప‌దేళ్ల కింద‌ట ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. గ‌తంలో చంద్ర‌కాంత్ విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేసేవాడు.

త‌రువాత ఆ ఉద్యోగాన్ని మానివేసి శాంతిన‌గ‌ర‌లో సిల్వర్‌స్టోన్‌ హోటల్‌ నిర్వహిస్తున్నారు. దంప‌తులిద్ద‌రూ హెబ్బాళ‌లో అపార్టుమెంట్‌లో నివాసముంటున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇద్ద‌రి మ‌ధ్యా త‌ర‌చూ ఘ‌ర్ష‌ణ చెల‌రేగుతుండేది.

జనవరి 6వ తేదీన కూడా వారు గొడ‌వ ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో ఆవేశానికి గురైన చంద్రకాంత్‌ భార్య గొంతు పిసికి హ‌త్య‌చేశాడు. మృత‌దేహాన్ని మాయం చేయ‌డానికి త‌న స్నేహితుడి స‌హ‌కారాన్ని తీసుకున్నాడు.

స్నేహితుడు రాజ్‌వీర్‌సింగ్‌ను పిలిచి రాత్రిపూట అక్ష‌త మృతదేహాన్ని కారులో వేసుకుని తమిళనాడు సరిహద్దులో శూలగిరి స‌మీపంలోని కామనదొడ్డి అటవీప్రాంతంలో ప‌డేసి, పెట్రోల్‌తో ద‌హ‌నం చేశారు.

ఆమె ఫోన్‌ను తీసుకుని చంద్రకాంత్‌ పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లకు వెళ్లాడు. త‌మ‌ కుమార్తె అక్షితకు ఎన్నిసార్లు ఫోన్ చేసిన‌ప్ప‌టికీ.. బ‌దులు రాలేదు. దీనితో ఆమె తల్లిదండ్రులకు అనుమానం వ‌చ్చింది.

జ‌న‌వ‌రి 23వ‌ తేదీన వారు సంపిగె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె అదృశ్యమైనట్లు తెలిపారు. అక్షిత, చంద్రకాంత్‌ ఇద్దరూ గొడవపడుతుండేవార‌నే విషయాన్ని పోలీసులకు వెల్ల‌డించారు.

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ఆరంభించారు. అక్ష‌త ఫోన్ సిగ్న‌ళ్ల కోసం అన్వేషించ‌గా.. పంజాబ్, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్, రాజస్థాన్‌లలో ఉన్న‌ట్లు తేలింది. దీనితో పోలీసులు చంద్రకాంత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, హత్య చేసినట్లు అంగీక‌రించాడు.

భార్యకు మరొకరితో అక్రమ సంబంధం ఉండేదని, ఆమె విపరీతంగా మద్యం సేవించేదని, భరించలేక తాను ఆమెను హత్యచేసినట్లు నిందితుడు విచారణలో చెప్పాడు. అతని మిత్రుడు రాజ్‌వీర్‌సింగ్‌ను కూడా అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here