నీళ్లు లేని వ్య‌వ‌సాయ బావిలో నుంచి పొగ‌..వెళ్లి చూడ‌గా!

బ‌ళ్లారి: పొర‌పాటున నీళ్లులేని వ్య‌వ‌సాయ బావిలో ప‌డ్డ ఎలుగుబంటికి గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు నిప్పు అంటింటి, కాల్చి చంపిన దారుణ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని బ‌ళ్లారి జిల్లా కుడ్లిగి తాలూకా ప‌రిధిలోని క‌డేకూళ్ల గ్రామంలో చోటు చేసుకుంది.

ఆహారం, దాహార్తిని తీర్చుకోవ‌డానికి స‌మీపంలోని జ‌రిమ‌లె అడ‌వుల్లో నుంచి ఆ ఎలుగుబంటి ఆదివారం మ‌ధ్యాహ్న స‌మ‌యంలో స‌మీపంలోని పొలాల‌కు వెళ్లింది. దీన్ని చూసిన రైతులు మొద‌ట అట‌వీశాఖ సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న అట‌వీశాఖ సిబ్బంది.. ఆ ఎలుగుబంటికి నీటిని అందించారు. నీరు తాగిన త‌రువాత దాన్ని మ‌ళ్లీ అడ‌వుల్లోకి పంపించేశారు. సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో నీళ్లు లేని ఓ వ్య‌వ‌సాయ బావి నుంచి పొగ వ‌స్తుండ‌టాన్ని చూసిన రైతులు అక్క‌డికి వెళ్ల‌గా.. బావిలో ఎలుగుబంటి స‌జీవంగా ద‌హ‌న‌మై క‌నిపించింది.

వెంట‌నే స్థానిక రైతులు గుడ‌కోటె పోలీస్‌స్టేష‌న్‌, ఉప అర‌ణ్యాధికారి మ‌హేష్‌, హెచ్ వెంక‌టేష్‌ల‌కు స‌మాచారం ఇచ్చారు. బావి వ‌ద్ద‌కు చేరుకున్న పోలీసులు, అట‌వీ సిబ్బంది కుడ్లిగి నుంచి అగ్నిమాప‌క ద‌ళాల‌ను ర‌ప్పించి, ఎలుగుబంటి క‌ళేబ‌రాన్ని వెలికి తీయించారు. కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here