వైర‌స్ లేదు గీర‌స్ లేదంటూ గ‌బ్బిళాలు కొరికిన పండ్ల‌ను కోసుకు తిన్న ప్ర‌కృతి వైద్యుడు

కేర‌ళ‌ను అత‌లాకుత‌లం చేస్తూ, ఇప్ప‌టికే డ‌జ‌నుమంది దాకా ప్రాణాల‌ను బ‌లి తీసుకున్న నిఫా వైర‌స్ అనేది లేనే లేద‌ని చెబుతున్నారు ఓ నేచురల్ థెర‌పిస్ట్‌. ఆయ‌న కూడా కేర‌ళ‌కు చెందిన వ్య‌క్తే. పేరు మోహ‌న‌న్ వైద్యేయ‌ర్‌. ప్ర‌కృతి వైద్యంలో ఆయ‌న‌కు మంచి పేరుంది.

నిఫా వైర‌స్ పుట్టిందంటూ చెబుతోన్న పెరంబ్రా ప్రాంతానికే చెందిన మోహ‌నన్‌.. కొత్త‌గా ఓ స‌వాలు విసిరారు. నిఫా వైర‌స్ అనేది కార్పొరేట్ సంస్థ‌ల సృష్టి అని ఆరోపిస్తున్నారు. గ‌బ్బిళాల ద్వారా ఈ వైర‌స్ సోకుతోందంటూ ప్ర‌చారం వ‌చ్చిన నేప‌థ్యంలో.. అవి కొరికి వ‌దిలేసిన జామ‌, మామిడి పండ్ల‌ను హాయిగా కోసుకుని తిన్నారు.

గ‌బ్బిళాలు కొరికిన భాగాన్ని క‌త్తితో కోసి ప‌డేసి, మిగిలిన భాగాన్ని తిన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయ‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. నిఫా వైర‌స్ అనేది వైర‌సే కాద‌ని, దాన్ని తాను నిరూపిస్తాన‌ని అంటున్నారు.

ప‌రిస్థితులు, ఇత‌రత్రా అనారోగ్య కార‌ణాల వ‌ల్లే ఇప్ప‌టిదాకా మ‌ర‌ణాలు సంభ‌వించాయని, వాటికి నిఫా వైర‌స్ అని పేరు పెట్టి, జ‌నాల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శిస్తున్నారు. జాక‌బ్ వ‌డ‌క‌న్‌చేరి అనే మ‌రో ప్ర‌కృతి వైద్యుడు కూడా అదే మాట అంటున్నారు. వైర‌స్ అనేది కేర‌ళ వంటి రాష్ట్రాల్లో సోకే అవ‌కాశ‌మే లేద‌ని, ఇదంతా కార్పొరేట్ ఔష‌ధ సంస్థ‌ల క‌ల్ప‌న అని ఆరోపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here