భ‌ర్త ప్రాణానికి హాని ఉందంటూ ఫిర్యాదు చేసిన 24 గంట‌ల్లో అత‌ని మృత‌దేహం..చెరువులో తేలింది!

త‌న భ‌ర్త విష‌యంలో ఆ యువ‌తి ఊహించిందే జ‌రిగింది. ఆమె భ‌య‌ప‌డిందే నిజ‌మైంది. త‌న ప్రాణానికి హాని ఉంద‌ని, ఎవ‌రైనా ఆయ‌న‌ను హ‌త్య చేస్తారంటూ ఓ యువ‌తి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఆమె భ‌ర్త మృత‌దేహం ఓ చెరువులో తేలియాడుతూ క‌నిపించింది. ఈ ఘ‌టన కేర‌ళ‌లోని కొట్టాయంలో చోటు చేసుకుంది. మృతుడి పేరు కెవిన్ పీ జోసెఫ్‌.

వ‌య‌స్సు 23 సంవ‌త్స‌రాలు. కొట్టాయంలోని ఎస్ హెచ్ మౌంట్‌లో భార్య నీనూ చాకోతో క‌లిసి నివాసం ఉంటున్నాడు. కొద్దిరోజుల కింద‌టే జోసెఫ్ వివాహ‌మైంది. నీనూ చాకోను అత‌ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి ఆ యువ‌తి ఇంట్లో వాళ్లెవ్వ‌రికీ ఇష్టం లేదు.

ఈ నెల 24వ తేదీన నీనూ చాకో సోద‌రుడు త‌న స్నేహితుల‌తో క‌లిసి వ‌చ్చి, కెవిన్ జోసెఫ్‌ను బ‌ల‌వంతంగా కారులో తీసుకెళ్లారు. ఇదంతా నీనూ చాకో క‌ళ్లెదురుగానే చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న దిగ్భ్రాంతికి గురైన నీనూ చాకో.. కొట్టాయం గాంధీన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె కేసును పోలీసులు స్వీక‌రించ‌లేద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

మూడురోజుల పాటు ఆమె పోలీస్‌స్టేష‌న్ చుట్టూ తిరిగిన‌ప్ప‌టికీ.. ఫ‌లితం లేదు. త‌న భ‌ర్తకు ప్రాణాపాయం ఉంద‌ని చెప్పిన‌ప్ప‌టికీ గాంధీన‌గ‌ర్ పోలీసులు కేసు న‌మోదు చేయ‌లేదు. ఇదిలావుండ‌గానే- ఆదివారం సాయంత్రం కెవిన్ జోసెఫ్ మృత‌దేహం పొరుగునే ఉన్న కొల్లం జిల్లా చ‌లియ‌క్కారా చెరువులో తేలింది. మొద‌ట గుర్తు తెలియ‌ని మృత‌దేహంగా కొల్లం పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

వారి ద‌ర్యాప్తులో ఆ మృత‌దేహం కెవిన్ జోసెఫ్‌దేన‌ని తేలింది. దీనితో ఈ కేసును గాంధీన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌కు బ‌ద‌లాయించారు. ఈ ఘ‌ట‌నపై విచార‌ణ‌కు ఆదేశించిన కొట్టాయం జిల్లా ఎస్పీ.. గాంధీన‌గ‌ర్ ఎస్ఐ ఎంఎస్ శిబును స‌స్పెండ్ చేశారు. స‌కాలంలో కేసు న‌మోదు చేయ‌లేద‌నే కార‌ణంతో ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు జిల్లా ఎస్పీ కార్యాల‌యం వెల్ల‌డించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here