ర‌క్ష‌ణ కోసం 100కు డ‌య‌ల్ చేస్తే.. పోలీసుల యూనిఫాంలో వెళ్లి మ‌రీ కిడ్నాప్ చేసిన దుండ‌గులు!

ప‌న్నా: గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి ప్రాణ‌భ‌యం ఉన్న ఓ యువ‌తి.. ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా పోలీసుల ర‌క్ష‌ణ కోరింది. దీనికోసం ఆమె 100కు ఫోన్ చేసింది.

త‌న వివ‌రాల‌ను వెల్ల‌డించి, ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిందిగా ప్రాధేయ‌ప‌డింది. ఈ స‌మాచారం అందుకున్న వెంట‌నే.. ఖాకీ డ్రెస్సు వేసుకున్న అయిదుమంది వ్య‌క్తులు హుటాహుటిన ఆ యువ‌తి ఇంటికి వెళ్లారు.

ఆ యువ‌తిని, ఆమె తండ్రి, సోద‌రుడినీ జీపులో ఎక్కించుకుని మ‌రీ తీసుకెళ్లారు. కొంత‌దూరం వెళ్లాక తండ్రి, సోద‌రుడిని జీపులో నుంచి విసిరేసి యువ‌తితో పారిపోయారు.

ఖాకీ డ్రెస్సులో వెళ్లిన అయిదుమందీ ఆమెను కిడ్నాప్ చేశారు. పోలీసు జీపును అడ్డ‌గించి, వారిని క‌ట్టేసి, వారి క‌ళ్ల‌ముందే ఆ యువ‌తిని కిడ్నాప్ చేశారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప‌న్నా జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న‌. జిల్లాలోని బర్ముహా గ్రామంలో ఓ వ్యక్తి రోడ్డుపై గాయాల‌తో పడి ఉన్నాడని 100 నంబ‌ర్‌కు మొద‌ట ఓ ఫోన్‌కాల్ వ‌చ్చింది.

దీనితో వారు సంబంధిత పోలీసుల‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి రాగా.. రోడ్డుపై ఉన్న వ్యక్తి పోలీసులు దగ్గరికి రాగానే లేచి తుపాకీతో బెదిరించాడు.

వెంటనే సమీపంలో పొదల్లో దాక్కున్న నలుగురు వ్యక్తులు వచ్చి పోలీసులను కట్టేసి వారి యూనిఫాం విప్పి వేసుకున్నారు. పోలీసులను వేరే కారులోకి ఎక్కించి బంధించారు.

పోలీసు వాహనంలో పోలీసుల మాదిరిగా వెళ్లి యువతిని కిడ్నాప్‌ చేశారు. ఆమె తండ్రిని, సోదరుడిని కూడా వాహనం ఎక్కించుకున్నారు.

కొద్ది దూరం వెళ్లాక యువతి తండ్రిని, సోదరుడిని బలవంతంగా వాహనం దింపేసి యువతిని తీసుకెళ్లిపోయారు.

దుండగులు కొద్దిసేపటి తర్వాత పోలీసు వాహనాన్ని, వేరే కారులో బంధించి ఉన్న పోలీసులను వదిలేసి యువతిని తీసుకొని పారిపోయారని పన్నా ఎస్పీ తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here