వైర‌స్ సోకి మ‌ర‌ణించిన న‌ర్సు ఇద్ద‌రు పిల్ల‌ల మెడిక‌ల్ రిపోర్ట్‌లో ఏముందంటే..!

కేర‌ళ‌ను కుదిపేస్తోన్న నిఫా వైర‌స్ సోకిన రోగికి చికిత్స అందిస్తూ, అదే వైర‌స్ సోకి మ‌ర‌ణించిన లిని పుదుస్సేరి ఇద్ద‌రు కుమారుల‌కు కూడా డాక్ట‌ర్లు వైద్య ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. అద్భుతం ఏమిటంటే- లిని ఇద్ద‌రు కుమారుల‌కు ఆ వైర‌స్ సోక‌లేదు. ఫ‌లానా వైర‌స్ సోకింద‌ని తెలియ‌క ముందు నుంచే ఆ ఇద్ద‌రు పిల్ల‌లు త‌ల్లితో ఆడుకున్నారు.

ఆమె గోరు ముద్ద‌లు తిన్నారు. ఆప్యాయంగా ముద్దులు పెట్టారు. ఆమె ఒడిలో నిద్ర‌పోయారు. అయిన‌ప్ప‌టికీ.. ఆ వైర‌స్ ఆ త‌ల్లి నుంచి ఆ ఇద్ద‌రు కుమారుల‌కు సోక‌లేదంటే అది అద్భుత‌మే. లిని పుదుస్సేరికి జ్వ‌రం వ‌చ్చింద‌ని తెలిసిన వెంట‌నే డాక్ట‌ర్లు ఆమె ర‌క్తాన్ని ప‌రీక్ష కోసం పంపించారు.

ఆ త‌రువాత 3-4 రోజులకు లినికి నిఫా వైర‌స్ సోకిన‌ట్టు తేలింది. ఈ 3-4 రోజుల్లో ఆమె ఇంటి వ‌ద్దే ఉన్నారు. ఇంటి నుంచే ఆసుప‌త్రికి వెళ్లి రోగుల‌కు సేవ‌లందిస్తూ వ‌చ్చారు. లినికి నిఫా వైర‌స్ సోకిన‌ట్టు తేల‌గానే.. పెరంబ్రా ఆసుప‌త్రిలో ఉంచి చికిత్స అందించారు. ఆ వైర‌స్‌ను అంత‌మొందించే మందులు లేక‌పోవ‌డంతో డాక్ట‌ర్లు ఆమె ప్రాణాల‌ను కాపాడ‌లేక‌పోయారు. లినికి భ‌ర్త సంజేష్‌, ఇద్ద‌రు కుమారులు.

నిఫా వైర‌స్ సోకిన త‌న భార్య‌ను ఐసీయూలో ఉంచార‌న్న వార్త తెలిసిన వెంట‌నే సంజేష్ బహ్రెయిన్ నుంచి స్వ‌దేశానికి వ‌చ్చారు. దీనితో అత‌నికి వైర‌స్ సోక‌లేదు. అప్ప‌టిదాకా లిని కుమారులు రెండేళ్ల సిద్ధార్థ్‌, అయిదేళ్ల రుతుల్ త‌ల్లి వ‌ద్దే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ- ఆ పిల్ల‌ల‌కు మాత్రం వైర‌స్ సోక‌లేదు. తాజాగా డాక్ట‌ర్లు నిర్వ‌హించిన వైద్య ప‌రీక్ష‌ల్లో ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here