గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో క‌లిసి జంట‌గా హోట‌ల్ రూమ్‌లో దిగాడు! ఒంట‌రిగా రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోయాడు!

తైపీ: త‌న ప్రియురాలితో క‌లిసి హోట‌ల్ రూమ్‌లో దిగాడో 19 సంవ‌త్స‌రాల టీనేజ్ కుర్రాడు. అది అత‌ని రొమాంటిక్ హాలిడే ట్రిప్‌. ప‌రీక్ష‌లు పూర్తి కావ‌డంతో త‌న ప్రియురాలితో క‌లిసి హాలిడే ట్రిప్ కోసం హాంగ్‌కాంగ్‌కు వ‌చ్చాడు. అక్క‌డి ఓ హోట‌ల్‌లో దిగాడు. వెంట భారీ ల‌గేజీని తీసుకొచ్చాడు. ఉద‌యం రూమ్‌లోకి దిగిన ఆ కుర్రాడు.. అదే రోజు రాత్రి గ‌దిని ఖాళీ చేసి, వెళ్లిపోయాడు ఒంట‌రిగా.

అత‌ను జంట‌గా హోట‌ల్‌లోకి ప్ర‌వేశించ‌డం, ఆ త‌రువాత ల‌గేజీతో పాటు ఒంట‌రిగా చెక్ అవుట్ చేయ‌డం హోట‌ల్‌లో అమ‌ర్చిన సీసీ కెమెరాల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. మ‌రి అత‌గాడి ప్రియురాలు ఏమైన‌ట్టు? ఇదే విష‌యం హోట‌ల్ సిబ్బందిని కూడా తొల‌చి వేసింది. రూమ్‌లో దిగిన‌ప్ప‌టి నుంచి ఆమె ఒంట‌రిగా బ‌య‌టికి వెళ్ల‌లేదు. సీసీ టీవీ ఫుటేజీలు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

రూమ్‌లోనూ లేదు. మ‌రేమైన‌ట్టు? ఇదే విష‌యంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది హోట‌ల్ యాజ‌మాన్యం. అదే స‌మ‌యంలో త‌న కుమార్తె క‌నిపించ‌ట్లేదంటూ హాంగ్‌కాంగ్‌కు చెందిన ఓ వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం, అనుమానితునిగా ఆ టీనేజ్ కుర్రాడి పేరు చెప్ప‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలించ‌గా.. ఆ కుర్రాడు త‌న వెంట తెచ్చుకున్న ల‌గేజీ బ్యాగ్‌ను బ‌రువుగా మోసుకెళ్ల‌డం క‌నిపించింది. త‌న ప్రియురాలిని హ‌త్య చేసి, ల‌గేజీ బ్యాగ్‌లో కుక్కేశాడ‌ట‌. అందుకే- ఆ బ్యాగ్ కాస్తా బ‌రువుగా మార‌డంతో దాన్ని లాగ‌లేక, లాగ‌లేక లాక్కెళ్లిన‌ట్టు తేలింది. ఆ కుర్రాడి పేరు చాన్ టుంగ్‌. ఆ యువ‌తి పేరు ప్యూహియువింగ్‌.

వారిద్ద‌రూ హాంగ్‌కాంగ్ చెందిన యూనివ‌ర్శిటీ విద్యార్థులు. హాలిడే ట్రిప్ కోసం కింద‌టి నెల 17వ తేదీన తైవాన్‌కు వెళ్లారు. తైపీలోని ప‌ర్పుల్ గార్డెన్ హోట‌ల్‌లో దిగారు. అదే రోజు రాత్రి చాన్ త‌న ప్రియురాలిని హ‌త‌మార్చాడు. ఆమె మృత‌దేహాన్ని ల‌గేజీ బ్యాగులో కుక్కి దాన్ని బ‌రువుగా తీసుకెళ్ల‌డం సీసీ టీవీల్లో క‌నిపించింది. ఒంట‌రిగానే హాంగ్‌కాంగ్‌కు వెళ్లాడు.

త‌న కుమార్తె ఏదంటూ ఫ్యూహియువింగ్ తండ్రి నిల‌దీశాడు. స‌రైన స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డంతో ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. చాన్‌పై అనుమానం వ్య‌క్తం చేశారు. అత‌ణ్ణి అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. అస‌లు విష‌యాన్ని వెల్ల‌డించాడు. తైపీలో తాము దిగిన హోట‌ల్‌లోనే ఆమెను హ‌త‌మార్చిన‌ట్టు చెప్పాడు.

లగేజీ బ్యాగులోకి కుక్కిన ఆమె మృత‌దేహాన్ని తైపీలోని ఝువీయ్ మెట్రో స్టేష‌న్ స‌మీపంలోని నిర్జ‌న ప్ర‌దేశంలో ప‌డేసిన‌ట్టు చెప్పాడు. అత‌ను చెప్పిన దాని ప్ర‌కారం.. పోలీసులు ఝువీయ్ మెట్రో స్టేష‌న్ స‌మీపంలో గాలించ‌గా..ఆ యువ‌తి మృత‌దేహం ల‌భ్య‌మైంది. పోలీసులు అత‌ణ్ణి అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here