స్కానింగ్‌కు వెళ్ల‌గా ఒక‌టే కిడ్నీ ఉన్న‌ట్టు తేలింది..కొట్టేసిందెవ‌రో తెలుసుకుని కుప్ప‌కూలింది!

కోల్‌క‌త‌: అడిగినంత క‌ట్నం ఇవ్వలేదని భార్య కిడ్నీనే కొట్టేశాడు ఓ భ‌ర్త‌. దీనికోసం డాక్ట‌ర్ల‌కు లంచం ఇచ్చాడు. అపెండిసైటిస్ ఆప‌రేష‌న్ అంటూ డాక్ట‌ర్ల‌తో నాట‌కం ఆడించి.. భార్య కిడ్నీని దొంగిలించాడు. దాన్ని రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు అమ్మ‌కానికి పెట్టాడు.

ఆప‌రేష‌న్ త‌రువాత అనారోగ్యానికి గురైన ఆ మ‌హిళ ఆసుప‌త్రికి వెళ్లారు. స్కానింగ్ చేయించుకోగా.. ఒక‌టే కిడ్నీ ఉన్న‌ట్టు తేలడంతో అస‌లు గుట్టు ర‌ట్ట‌యింది. ఈ ఘ‌ట‌న కోల్‌క‌త‌లో చోటు చేసుకుంది. ఈ ఉదంతం రెండేళ్ల త‌రువాత వెలుగులోకి రావ‌డం షాక్‌కు గురి చేసింది.

బాధితురాలి పేరు రీటా సర్కార్‌. వ‌య‌స్సు 28 సంవ‌త్స‌రాలు. 12 ఏళ్ల కింద‌ట ఆమెకు బిశ్వ‌జిత్ అనే యువ‌కుడితో పెళ్ల‌యింది. పెళ్లి సంద‌ర్భంగా రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను క‌ట్నంగా ఇస్తామ‌ని మాటిచ్చారు. రీటా స‌ర్కార్ త‌ల్లిదండ్రులు ల‌క్ష రూపాయ‌ల‌ను మాత్ర‌మే ఇవ్వ‌గ‌లిగారు.

 

మొత్తం రెండు లక్ష‌ల రూపాయ‌ల‌ను ఇవ్వాల్సిందేనంటూ బిశ్వ‌జిత్ త‌ల్లిదండ్రులు, ఇత‌ర కుటుంబీకులు రీటా స‌ర్కార్‌ను వేధింపుల‌కు గురి చేస్తుండేవారు.

 

రెండేళ్ల కిందట రీటాకు కడుపునొప్పి రావడంతో బిశ్వ‌జిత్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. క‌డుపునొప్పికి అపండిసైటిస్ కార‌ణ‌మ‌ని చెప్పి కిడ్నీని డాక్ట‌ర్ల స‌హాయంతో తొల‌గించాడు.

 

దాన్ని రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు అమ్మేశాడు. అపండిసైటిస్ ఆప‌రేష‌న్ తర్వాత రీటా స‌ర్కార్ ఆరోగ్యం మెరుగుప‌డ‌లేదు. దీనితో ఆమెను త‌ల్లిదండ్రుల త‌ర‌ఫు బంధువులు నార్త్ బెంగాల్ మెడిక‌ల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్క‌డ స్కానింగ్ చేయించుకోగా ఒక‌టే కిడ్నీ ఉన్న‌ట్లు తేలింది.

దీనితో షాక్‌కు గురైన రీటా కట్టుకున్న భర్తే మోసం చేశాడని నిర్ధారించుకుంది. ఈ ఘటనపై ఫరక్కా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

రీటా భర్త బిశ్వ‌జిత్‌తోపాటూ అతని సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రీటాకి సర్జరీ చేసిన ఆసుపత్రిపై కూడా పోలీసులు దాడులు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు కిడ్నీ అమ్మేసినట్టు బిశ్వ‌జిత్‌ నేరాన్ని ఒప్పుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here