బాలిక‌పై వేధింపులు..అదేమ‌ని అడిగితే `లోకల్‌` అంటూ హెచ్చ‌రిక‌లు!

కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాజ‌స్థాన్ నుంచి వ‌ల‌స వ‌చ్చిన మార్వాడీ కుటుంబానికి చెందిన బాలిక ఒక‌రు నిద్ర‌మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. స్థానిక యువ‌కుడొక‌డు ఆమెను వేధిస్తుండ‌ట‌మే దీనికి కార‌ణ‌మ‌నే అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి. మండ‌లంలోని ఆల‌మూరు గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీన్ని రుద్ర‌వ‌రం పోలీసులు కూడా ఈ విష‌యాన్ని ధృవీక‌రించారు.

ఆ బాలిక ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌నడానికి స‌రైన కార‌ణాల‌ను అన్వేషిస్తున్నామ‌ని తెలిపారు. రాజ‌స్థాన్‌కు చెందిన ఓ కుటుంబం ఆలమూరుకు వలస వచ్చి స్వీట్ల‌ను అమ్ముకుంటూ జీవ‌నం సాగిస్తోంది. స‌మీప బంధువుల కుమార్తె ఒక‌రు వారితోనే నివాసం ఉంటోంది. ఆలమూరుకు చెందిన ఓ యువ‌కుడు నిత్యం ఆమెను వేధిస్తుండేవాడ‌ని, తాము అడ్డుకున్న‌ప్ప‌టికీ.. లోకల్ అని బెదిరించే వాడ‌ని మృతురాలి బంధువులు చెబుతున్నారు. ఈ వేధింపుల‌ను భ‌రించ‌లేక ఆ బాలిక‌ మంగళవారం రాత్రి నిద్రమాత్రలు మింగింది.

బుధవారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గమనించిన కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. బాలిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నది వాస్తవమేనని రుద్ర‌వ‌రం పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని చెప్పారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here