ఆ ఏడుకొండలవాడు మరింత స్పష్టంగా..!

ఆ ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు తిరుమలకు ప్రతి ఏటా.. కొన్ని కోట్ల మంది వెళుతూ ఉంటారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి వెళ్ళినప్పటికీ ఎక్కువసేపు ఆ ఆస్వామి వారి దివ్యమంగళ రూపాన్ని చూడనివ్వరు. అదీ కాకుండా స్వామి వారిని చాలా తక్కువ వెలుగులో ఉంచారు అని అనుకుంటాం.. ఇకపై స్వామి వారిని మరింత వెలుగులో దర్శించుకునే భాగ్యం కలుగనుంది.

గర్భగుడిలోని నేతి దీపాల వెలుగుల కాంతిని పెంచాలని టీటీడీ నిర్ణయించింది. వీటిల్లోని ఒత్తుల పరిమాణాన్ని పెంచి, ఉదయం సుప్రభాతసేవ సమయంలో ఆపై మధ్యాహ్నం 11 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు మరింత నెయ్యిని నింపించడం ద్వారా, స్వామిని మరింత స్పష్టం చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఆగమ శాస్త్రాల ప్రకారం, గర్భగుడిలో విద్యత్ దీపాలను వెలిగించరాదు. అందువల్లే అనాదిగా నేతి దీపాల వెలుగులోనే స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఇద్దరు ఏకాంగులు దీపకాంతిని తగ్గకుండా చూస్తుంటారు. వేలాడదీసిన రెండు దీపకుందీలతో పాటు కిందివైపు మరో రెండు కుందీల్లో వెలిగే దీపాల కాంతి నడుమే స్వామిని దర్శించుకోవాలి. వీటి వెలుగులను పెంచడంతో జయవిజయుల విగ్రహాల వద్ద నుంచి కూడా స్వామి స్పష్టంగా కనిపిస్తారట. ఏది ఏమైనా కానీ ఈ నిర్ణయాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here