విద్యార్థిని కొట్టి చంపారు! కోమాలో వెళ్లినా వ‌దల్లేదు..చ‌చ్చేంత వ‌ర‌కూ కొట్టారు!

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. రెస్టారెంట్‌లో చెల‌రేగిన చిన్న గొడ‌వ‌.. ఓ విద్యార్థి హ‌త్య‌కు దారి తీసింది. త‌న స్నేహితుల‌తో క‌లిసి భోజ‌నం చేయ‌డానికి ఆ రెస్టారెంట్‌కు వ‌చ్చిన ఆ విద్యార్థిని కొట్టి చంపారు కొంద‌రు వ్య‌క్తులు.

వారు కొట్టిన దెబ్బ‌ల‌కు తాళ‌లేక ఆ విద్యార్థి సంఘ‌ట‌నాస్థ‌లంలోనే స్పృహ త‌ప్పాడు. కోమాలోకి వెళ్లాడు. అయినా వ‌ద‌ల్లేదు. కోపం చ‌ల్లార‌క ప్రాణం పోయేంత వ‌ర‌కూ కొట్టారు.

కోమాలో ఉన్న ఈ విద్యార్థిని ఆసుప‌త్రికి త‌ర‌లించగా.. చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని అల‌హాబాద్‌లో చోటు చేసుకుంది.

అల‌హాబాద్ కాళికా రెస్టారెంట్‌లో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు విడుద‌ల చేశారు. హ‌తుడి పేరు దిలీప్ స‌రోజ్‌. న్యాయ విద్యార్థి. స్థానిక లా కాలేజీలో సెకెండ్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు.

తన స్నేహితులతో క‌లిసి భోజ‌నం చేయడానికి కాళికా రెస్టారెంట్‌కు వెళ్లాడు. విజయ్‌ శంకర్ అనే వ్యక్తికి దిలీప్‌ కాలు తగిలింది. దీనితో గొడ‌వ మొద‌లైంది. భోజ‌నం పూర్త‌యిన త‌రువాత కూడా గొడవ చోటు చేసుకుంది.

భోజ‌నం ముగించి బ‌య‌టికి వ‌చ్చిన దిలీప్‌ను ప‌ట్టుకొని విజ‌య్‌శంక‌ర్ త‌న స్నేహితుల‌తో క‌లిసి హాకీ స్టిక్కులు, ఇనుప క‌డ్డీల‌తో దాడి చేశారు. మున్నా అనే వెయిట‌ర్ కూడా దిలీప్‌పై దాడి చేశాడు.

వారి దెబ్బ‌ల‌ను త‌ట్టుకోలేక దిలీప్ రెస్టారెంట్ మెట్ల మీదే కుప్ప‌కూలిపోయాడు. కోమాలోకి వెళ్లాడు. అయిన‌ప్ప‌టికీ.. అత‌ణ్ణి వ‌ద‌ల్లేదు. రెస్టారెంట్ మెట్ల మీద స్పృహ కోల్పోయి ప‌డివున్న దిలీప్‌ను రాళ్లు, ఇటుక‌ల‌తో కొట్టారు.

అత‌ణ్ణి స్నేహితులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనంతా బయట ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు విజయ్‌ శంకర్‌, మున్నాచౌహన్‌లను అదుపులోకి తీసుకున్నారు.

ఈ గొడ‌వ‌పై రెస్టారెంట్ య‌జ‌మాని పోలీసుల‌కు ముందే స‌మాచారం ఇచ్చిన‌ప్ప‌టికీ.. స‌కాలంలో చేరుకోలేద‌నే కార‌ణంతో ఇద్దరు కానిస్టేబుళ్ల‌ను సస్పెండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here